నేను డాక్టర్ ని కాదు.. కుటుంబ సభ్యుడిలా వచ్చాను -జూ.ఎన్టీఆర్

Sun Jan 29 2023 12:56:33 GMT+0530 (India Standard Time)

Jr NTR and Kalyan Ram about Taraka Ratna Health

తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని.. మెరుగైన వైద్యం అందుతోందని టాలీవుడ్ యంగ్ హీరో జూ.ఎన్టీఆర్ అన్నారు.  కుప్పంలో గుండెపోటుతో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన నందమూరి సోదరులు జూ.ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు బెంగలూరులోని ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించారు.అనంతరం మీడియా ముందు జూ.ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మాట్లాడారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘అన్న తారకరత్న బాగా పోరాడుతున్నారని.. వైద్యంతోపాటు ఆత్మబలం మనోబలంతో  పోరాడుతున్నారని.. అభిమానుల ఆశీర్వాదం ఉందని..  తాతా గారి ఆశీర్వాదం ఉందని.. ఎంతో మంది ఆశీర్వాదం ఆయనకు ఉంది.. త్వరలోనే తారకరత్న కోలుకొని ఇదివరకటి లాగానే మన అందరితో ఆనందంగా ఉండాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నానని’ ఎన్టీఆర్ అన్నారు.

ఇదో అనుకోని సంఘటన.. ఈ ఆస్పత్రి వారు చాలా మంచి వైద్యాన్ని అందిస్తున్నారు. మనం అందరం ఆయన కోలుకోవాలని ప్రార్ధిద్దామని.. మీరందరూ మీ ప్రేయర్స్ ను అన్న తారకరత్నకు అందించాలని ఎన్టీఆర్ కోరారు.

ఇక తమతోపాటు ఉండి.. తన అన్నయ్య తారకరత్నకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తోడ్పాటు నందించిన కర్ణాటక హెల్త్ మినిస్టర్ ప్రభాకర్ కు ఎన్టీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాకెంతో ఆప్తులు.. ఇలాంటి సందర్భంలో ఆయన కూడా ఉండి  సహాయం  అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఎన్టీఆర్ తెలిపారు.

తారకరత్న మాట్లాడుతున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. నేను డాక్టర్ ని కాదు.. కుటుంబ సభ్యుడిలా వచ్చానని.. డాక్టర్లు తనకు చెప్పింది మీకు చెప్పి ధైర్యం  చెబుతున్నానని ఎన్టీఆర్ తెలిపారు. తారకరత్నను స్వయంగా  నేను చూశాను.. స్పందిస్తున్నారు.. మెరుగైన వైద్యం అందుతోందని.. నిమ్స్ నుంచి ఇద్దరు వైద్యులను కూడా తెప్పించి పరిశీలిస్తున్నారు. అందరి ఆశీర్వాదంతో ఆయన కోలుకుంటారని ఎన్టీఆర్ తెలిపారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నా నిలకడగా ఉన్నారని.. వైద్యానికి స్పందిస్తున్నారని వైద్యులు చెప్పారని ఎన్టీఆర్ వివరించారు. ఎక్మో చికిత్సలో తారకరత్న లేరని.. స్పందిస్తున్నారంటూ ఎన్టీఆర్ తెలిపారు.

మీ అందరి అభిమానంతో తప్పకుండా తమ్ముడు తారకరత్న తొందరగా కోలుకొని మన అందరి ముందు రావాలని దేవుడిని ప్రార్థించండి అని కళ్యాణ్ రాము ముగించారు.