రాజు గారూ.. థియేటర్ల ముందు అదేంటి?

Thu Aug 09 2018 23:06:47 GMT+0530 (IST)

దిల్ రాజు నిర్మాణంలో.. నితిన్-రాశి ఖన్నా జంటగా సతీశ్ వేగేశ్న రూపొందించిన ‘శ్రీనివాస కళ్యాణం’ గురువారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రం చూసేందుకు థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు ఆశ్చర్యకర స్వాగతం లభించింది. థియేటర్ల ముందు తోరణాలు.. పందిళ్లు వేసి ముస్తాబు చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇదే పెద్ద షాకంటే.. మేళతాళాలు ఏర్పాటు చేయడం మరీ విచిత్రం. ఏదో వేడుక జరుగుతున్నట్లుగా డోలు సన్నాయి శబ్దాలతో హోరెత్తిస్తుండటంతో జనాలకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. సింగిల్ స్క్రీన్లతో పాటు మల్టీప్లెక్సుల దగ్గర కూడా ఈ దృశ్యాలు కనిపించాయి.ఆయా థియేటర్లలో వేరే సినిమాలు కూడా ఆడుతుండటంతో ఈ హడావుడి ఏంటన్నది జనాలకు అర్థం కాలేదు. థియేటర్లలో ఏదైనా వేరే కార్యక్రమాలున్నాయేమో అనుకున్నారు కొందరు. కానీ అది పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం విడుదలను పురస్కరించుకుని దిల్ రాజు ఏర్పాటు చేసిన కార్యక్రమం అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ సినిమాను రాజు మరీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఏర్పాట్లు చేచయడం ఆవ్చర్యం కలిగించింది. కానీ జనాలకు మాత్రం ఇదంతా అతిగా.. కామెడీగా అనిపించి నవ్వుకుంటున్నారు. అందులోనూ సినిమా చూసి బయటికి వచ్చాక జనాల ఫీలింగే వేరుగా ఉంటోంది. పెళ్లి గొప్పదనాన్ని చెప్పే క్రమంలో సినిమాలో డోస్ మరీ ఎక్కువైపోగా.. బయటికి వచ్చాక ఈ వాయిద్యాల హంగామా చూసిన జనాలు ఏమనుకుంటారో చెప్పేదేముంది?