'జయమ్మ' చాలా గడుసుదే!

Sun Jan 16 2022 13:55:00 GMT+0530 (IST)

Jayamma Lyrical Song

సుమ అంటేనే ఆనందం .. అల్లరి .. సంతోషం .. సందడి. బుల్లితెరపై ఆమెకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఎప్పుడైతే ఆడియో రిలీజ్ ఫంక్షన్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లుగా మారిపోయాయో అప్పటి నుంచి హోస్ట్ గా సుమ మరింత బిజీ అయిపోయింది. చాలా కాలం క్రితమే సుమ ముచ్చటపడి ఒక సినిమా చేసింది గానీ అది అంతగా ఆడలేదు. ఆ తరువాత నుంచి సుమ ఆ వైపు చూడలేదు. అలా చూసేంత సమయం కూడా ఆమెకి లేదు. సినిమా ఫంక్షన్స్ తో సుమ అంత బిజీ.అందరూ స్టార్ హీరోల డేట్స్ ను చూసుకుని షూటింగు పెట్టుకుంటారనీ కానీ ఆ స్టార్స్ కూడా సుమ డేట్స్ చూసి ఫంక్షన్స్ పెట్టుకుంటూ ఉంటారని ఇటీవల నాని ఒక స్టేజ్ పై అన్నాడు. ఆయన ఎలా అన్నప్పటికీ అందులో నిజం ఉంది.  అంత బిజీగా ఉండే సుమ కాస్త తీరిక చేసుకుని ఒక సినిమా చేసింది. ఆ సినిమా పేరే 'జయమ్మ పంచాయితీ'. ఈ సినిమా టైటిల్ .. జయమ్మగా సుమ లుక్ చూసిన వారంతా ఇది ఆమెకి కరెక్ట్ కథనే అనుకున్నారు. బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమాకి విజయ్ కుమార్. కె దర్శకత్వం వహించాడు.

టైటిల్ ను బట్టే ఈ కథ గ్రామీణ నేపథ్యంలో నడుస్తుందనే విషయం అర్థమైపోతుంది. ఇక ఆ విషయంలో ఏమైనా సందేహాలుంటే సుమ లుక్ పూర్తి క్లారిటీ ఇచ్చేస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

"కాసింత భోళాతనం .. కూసింత జాలిగుణం .. కాసింత గండ్రతనం .. కూసింత మొండితనం" అంటూ ఈ పాట జయమ్మ స్వభావానికి అద్దం పడుతూ సాగుతుంది. "అచ్చమైన పల్లెటూరి ఇత్తనం .. ఎక్కడైనా ఆమెదేగా పెత్తనం" అనే ఒక్క లైన్ చాలు జయమ్మ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పడానికి.

ఊళ్లోని అన్ని విషయాలు .. అందరి సంగతులు తనకే కావాలి అన్నట్టుగా ఆరాలు తీయడం. అలాగే చెడు అలవాట్లకి బానిసలై భార్యాలను ఇబ్బంది పెట్టేవారికి బుద్ధి చెప్పడం .. తాను ఇతరులకు సాయపడటం .. అలాగే అందరూ తనకి సాయపడాలనుకోవడం జయమ్మ స్వభావంగా చూపించారు. కీరవాణి సంగీతం .. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. శ్రీకృష్ణ ఆలాపన ఈ పాటకు ప్రాణం పోశాయి. ఇక సుమ మార్క్ మాటలు కూడా ఈ పాటలో చోటు చేసుకున్నాయి. ఆమె ఎక్స్ ప్రెషన్స్ ఈ పాటకి హైలైట్. పల్లెటూరి మహిళగా ఆమె పలికించిన హావభావాలు అద్భుతం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.