జాన్వీ కోరుకున్న హీరోతో టాలీవుడ్ లోకి వచ్చేస్తోంది

Wed Jan 26 2022 17:07:29 GMT+0530 (IST)

Janvi is coming into Tollywood

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది. "జగదేక వీరుడు అతిలోక సుందరి"కి సీక్వెల్ చేస్తే ఆ మూవీ ద్వారా జాన్వీని పరిచయం చేయాలని శ్రీదేవి భావించింది కూడా. అయితే అది ఇప్పట్లో కార్యరూపం దాల్చడం కష్టంగా మారడంతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ కి బ్రేక్ పడింది. తాజాగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ రంగం సిద్ధం అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.విజయ్ దేవరకొండ చిత్రంతో టాలీవుడ్ లోకి జాన్వీ కపూర్ తెరంగేట్రం చేయబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఓ కార్యక్రమంలో జాన్వీ కపూర్ తనకు టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అంటే క్రష్ అని తనతో కలిసి నటించాలని వుందని తన మనలో కోరికని బయటపెట్టింది. తను కోరుకున్న విధంగానే విజయ్ దేవరకొండ సినిమాతో జాన్వీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అవుతున్నట్టుగా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారట.

'లైగర్' సినిమాలో జాన్వీ కపూర్ నటించాల్సింది. డేట్స్ సమస్య కారణంగా ఈ మూవీని వదులుకున్న ఆమె తాజాగా పూరి జగన్నాథ్ ఇచ్చిన ఆఫర్ ని ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో 'లైగర్' మూవీని తెరకెక్కిస్తున్న పూరి జగన్నాథ్ ఈ మూవీ తరువాత మళ్లీ విజయ్ తో ఓ భారీ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. గత కొంత కాలంగా `జన గణ మన` చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలని పూరి జగన్నాథ్ ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ తో ముందు అనుకున్నారు.. ఆ తరువాత మహేష్ బాబు తో చేయాలని ఫిక్సయ్యారు కానీ ఎంతకూ ముందుకు కదలలేదు.

దీంతో ఈ మూవీని విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించాలని పూరి జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నారట. ఇందు కోసం బాలీవుడ్ కు చెందిన కొంత మంది క్రేజీ స్టార్ లని కూడా ఈ చిత్రం కోసం అడుగుతున్నారట. ఇందులో భాగంగానే హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని సంప్రదించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కీలక పాత్రల కోసం బాలీవుడ్ క్రేజీ స్టార్స్ ని సంప్రదిస్తున్నారట.

ఇందులోని కీలక పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ని కీలక విలన్ పాత్ర కోసం హీరో అజయ్ దేవ్‌గన్ ని పూరి సంప్రదించాలనే ఆలోచనలో వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సమాజంపై తన పాత్రల ద్వారా సెటైర్లు వేసే పూరి జగన్నాథ్ `జనగణమన`లో సమాజంపై సమకాలీన రాజకీయాలపై
దేశ భక్తిపై కూడా సెటైర్లు వేస్తున్నారట.

దీంతో ఇందులో డైలాగ్ లు భారీగా వుంటాయని ఆ డైలాగ్ లకు విజయ్ దేవరకొండ ఇమేజ్ కరెక్ట్ గా సరిపోతుందని భావించిన పూరి ఈ చిత్రం కోసం విజయ్ దేవరకొండని హీరోగా ఎంచుకున్నారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.