ఇంటెన్స్ సీరియస్ డ్రామా.. ఇట్లు మారేడుమిల్లి..

Thu Jun 30 2022 15:20:44 GMT+0530 (India Standard Time)

Itlu Maredumilli Prajaneekam Teaser

అల్లరి నరేష్ గత ఏడాది కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన 'నాంది' మూవీతో కొత్త బాట పట్టారు. తన మార్కు హాస్య చిత్రాలకు పూర్తి భిన్నంగా సీరియల్ కథలవైపు అడుగులు వేస్తున్నారు. ఇంత వరకు తాను నటించని సరికొత్త పాత్రల్లో సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలన్న ఆలోచనలో కొత్త తరహా సీరియస్ ఇంటెన్స్ డ్రామాలని ఎంచుకుంటున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ 'ఇట్లు  మారేడు మిల్లి ప్రజానీకం'. ఏ.ఆర్. మోహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అభయారణ్యం మధ్యలో వున్న మారేడు మిల్లి గ్రామం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ ఈ మూవీని నిర్మిస్తున్నారు. 55 రోజుల పాటు ఈ మూవీ మారేడు మిల్లి అడవుల్లో యుద్ధం చేసిందని చిత్ర బృందం ఇటీవల విడుదల చేసిన ప్రీ టీజర్ లో స్పష్టం చేశారు. 250 మంది టీమ్ సైనికుల్లా ఈ మూవీ కోసం వ్యవప్రయాసల కోర్చి ఏ స్థాయిలో శ్రమించారో చూపించారు.

ఇదిలా వుంటే గురువారం జూన్ 30న హీరో అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం టీజర్ ని విడుదల చేసింది. ఆనంది హీరోయిన్ గా నటించింది. టీజర్ చూస్తుంటే మారుమూల ప్రాంతమైన మారేడుమిల్లి ట్రైబల్ ఏరియాలో సాగే సీరియస్ ఇంటెన్స్ డ్రామాగా తెలుస్తోంది.

ఓటర్ రమోదు కోసం వెళ్లే అధికారిగా హీరో నరేష్ ఇందులో నటించినట్టుగా తెలుస్తోంది. 'జీవితంలో ఒక్కసారి కూడా ఓటు వేయని వారు వున్నారు... అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది.

ఏదో పండగ చందాల లెక్క అడుక్కున్నట్టు ఈ డబ్బాలేసుకుని అనెజుకేటెడ్ ఫెలోస్ ని ఓటేయండి బాబూ అని అడుక్కోవడం ఏంటి సార్ అని వెన్నెల కిషోర్ చెబుతున్న డైలాగ్ లు..సాయం చేత్తే మనిసి..దాడి సేత్తే మృగం.. మేం మనుషులమే సారూ.. అంటూ ఆనందిని అంటున్న మాటలు.. పాతిక కిలోమిటర్లు ఇవతలికి వస్తే కానీ వీళ్లు ఎలా బ్రతుకుతున్నారో మనకు కూడా తెలియలేదు.. అంటూ హీరో నరేష్ చెబుతున్న డైలాగ్ లు సినిమా ఓ ఇంటెన్స్ సీరియస్ డ్రామా అని స్పష్టమవుతోంది.

టీజర్ చూస్తుంటే రాజ్ కుమార్ రావు నటించిన 'న్యూటన్' మూవీని గుర్తు చేస్తోంది. దీన్ని పక్కన పెడితే చాలా రోజుల తరువాత అల్లరి నరేష్ తన పంథాకు భిన్నంగా సీరియస్ సినిమాలతో సామాజిక అంశాలని టచ్ చేస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. సరికొత్త అంశం నేపథ్యంలో రూపొందిన 'ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం' కూడా నరేష్ కు మంచి హిట్ తో పాటు పేరుని తెచ్చేలా వుంది.