Begin typing your search above and press return to search.

RRR విడుదల అనేది మేకర్స్ చేతిలో లేదా..?

By:  Tupaki Desk   |   14 Sep 2021 4:30 PM GMT
RRR విడుదల అనేది మేకర్స్ చేతిలో లేదా..?
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేసారనేది సమాధానం లేని ప్రశ్నగా సినీ అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు విడుదలను వాయిదా వేసిన RRR మేకర్స్.. చివరగా అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి గట్టిగానే ట్రై చేశారు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను రిలీజ్ చేసే పరిస్థితి లేకపోవడంతో మరోసారి పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. కాకపోతే ఈసారి తదుపరి విడుదల తేదీని ప్రకటించలేదు.

'ఆర్.ఆర్.ఆర్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అక్టోబర్ 21 నాటికి దాదాపు పూర్తి అవుతాయని.. థియేటర్లు నిరవధికంగా మూసివేయబడి ఉన్నందున కొత్త విడుదల తేదీని ప్రకటించలేమని.. వరల్డ్ సినిమా మార్కెట్ ప్రారంభమైనప్పుడు సాధ్యమైనంత త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చిత్ర బృందం తెలిపింది. దీంతో RRR సినిమా వచ్చే ఏడాది ఉగాది పండక్కి లేదా సమ్మర్ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల అనేది ఇప్పుడు మేకర్స్ చేతిలో లేదని టాక్ వినిపిస్తోంది.

'ఆర్.ఆర్.ఆర్' సినిమా నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా అన్ని భాషల ఎలక్ట్రానిక్ - డిజిటల్ - శాటిలైట్ హక్కులను పెన్ స్టూడియోస్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా మేకర్స్ అభివర్ణించారు. పెన్ స్టూడియోస్ వారు కూడా ప్రపంచ వ్యాప్తంగా పది భాషలకు సంబంధించిన రైట్స్ ను అమ్మేశారు. జీ గ్రూప్ - నెట్ ఫ్లిక్స్ - స్టార్ గ్రూప్ వారు పెద్ద మొత్తంలో అడ్వాన్స్ లు చెల్లించి ఇందులో భాగమై ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదల విషయమై ఇప్పటికే అగ్రిమెంట్ చేసుకున్నారట.

సాధ్యమైనంత వరకు అక్టోబర్ లో RRR చిత్రాన్ని రిలీజ్ చేయాలని.. కుదరని యెడల మరో నాలుగు నెలల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అగ్రిమెంట్ లో పేర్కొన్నారట. అందుకే సంక్రాంతి సీజన్ లో ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని తీసుకురావాలని నిర్మాతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఆల్రెడీ పండక్కి కర్చీఫ్స్ వేసి కూర్చున్న పెద్ద సినిమాలు దీనికి ససేమిరా అంటున్నారట. దీంతో ఇప్పుడు ఏమి చేయాలా అని మేకర్స్ ఆలోచిస్తున్నారట.

ఒకవేళ 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని అగ్రిమెంట్ లో రాసుకున్న ప్రకారం విడుదల చేయలేకపోతే నిర్మాతలు - డిస్ట్రిబ్యూటర్స్ - నాన్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్న వారి మధ్య ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కార్పోరేట్ సంస్థలతో కుదుర్చుకున్న బాండ్ బ్రేక్ చేయడం అంటే మామూలు వ్యవహారం కాదు. ఏదైనా తేడా జరిగితే కోర్టు దాకా వెళ్లే పరిస్థితి ఉంటుంది. అందుకే పరిస్థితులు సానుకూలంగా ఉంటే రాబోయే నాలుగు నెలల్లోనే మంచి రోజు చూసి RRR చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

కాగా, ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఫిక్షనల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవగన్ - శ్రియా - సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డి.వి.వి.దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.