బాలయ్యకు నచ్చచెప్పడానికి ప్రత్యేక కమిటీనా..?

Tue Aug 09 2022 19:00:01 GMT+0530 (India Standard Time)

Is it a special committee to please Balayya

టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలకు సమావేశాల ద్వారా పరిష్కరం చూపాలని.. దీనిపై ఓ నిర్ణయం తీసుకునే వరకూ సినిమా షూటింగులు నిలిపివేయాలని ఇండస్ట్రీ పెద్దలు బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సినిమా షూటింగ్ లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాతే దీనికి ఫిలిం ఛాంబర్ మద్దతు ఇచ్చింది.దీని ప్రకారం ఆగస్ట్ 1వ తేదీ నుంచి అన్ని తెలుగు సినిమాల షూటింగ్స్ పూర్తిగా నిలిపివేసారు. 'వారసుడు' 'సార్' లాంటి పలు బైలింగ్విల్ చిత్రాలు మరియు కొన్ని ఇతర భాషా సినిమాల షూటింగ్స్ మాత్రం యధావిధిగా జరుగుతున్నాయి. అయితే కొందరు ప్రముఖ నటీనటులు మరియు నిర్మాతలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది నిర్మాతలకు అదనపు భారంగా మారుతుందని పేర్కొంటున్నారట.

నిర్మాతల బంద్ మరియు గిల్డ్ వ్యవహారాల పట్ల నందమూరి బాలకృష్ణ మొదటి నుంచీ చాలా ఆగ్రహంతో ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తాను నటిస్తున్న సినిమా షూటింగ్ ఆపడానికి నిరాకరించారని.. యధావిధిగా షెడ్యూల్ ప్లాన్ చేయాలని బాలయ్య మైత్రీ నిర్మాతలను కోరినట్లు టాక్ వచ్చింది.

సీనియర్ హీరో చెప్పినట్లు షూటింగ్ స్టార్ట్ చేయకపోతే ఏమవుతుందో అని నిర్మాతలు ఆలోచిస్తుండగా.. బాలయ్య తిరిగి షూటింగ్ ప్రారంభిస్తే ఈ సమ్మె కు అర్థమే లేకుండా పోతుందని గిల్డ్ పెద్దలు భావిస్తున్నారట. అంతేకాదు అందరూ ఆయన బాటలోనే నడిస్తే పరిస్థితి ఏంటని తీవ్రంగా ఆలోచిస్తున్నారట.

ఈ నేపథ్యంలో బాలకృష్ణను ఒప్పించడానికి మరియు బంద్ కి ఆటంకం కలగకుండా జాగ్రత్త పడటానికి తాజాగా జరిగిన సమావేశంలో అయిదుగురు సీనియర్ నిర్మాతలతో ఓ కమిటీని వేశారట. ఈ కమిటీకి దిల్ రాజు దూరంగా ఉండగా.. బాలయ్యతో సాన్నిహిత్యం కలిగిన్న వారినే సభ్యులుగా ఉంచారట.

షూటింగ్స్ బంద్ చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం.. సమస్యల పురస్కారం కోసం ఏవిధంగా ముందుకు వెళ్తున్నారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే విషయాలని బాలకృష్ణకు వివరించి నచ్చ జెప్పే బాధ్యతను సీనియర్ నిర్మాతల ప్రత్యేక కమిటీకి అప్పగించారట. ఒకవేళ ఇదే నిజమైతే బాలయ్య ఎంతవరకు వారి మాట వింటారో చూడాలి.

ఇదిలా ఉంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున ఇటీవల దిల్ రాజు - సి కళ్యాణ్ వంటి ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. ఓటీటీ రిలీజులు - వీపీఎఫ్ ఛార్జీలు - రెవెన్యూ పర్సంటేజీ - సినీ కార్మికుల వేతనాలు - నిర్మాణ వ్యయాలపై ఫిలిం చాంబర్ ఆధ్వర్యంలో నాలుగు కమిటీలు పనిచేస్తున్నాయని తెలిపారు.

సమస్యల పరిష్కారం కోసమే నిరవధికంగా షూటింగ్స్ బంద్ చేశామని.. నిర్మాతల మధ్య ఎటువంటి బేధాభిప్రాయాల్లేవని చెప్పారు. ఛాంబర్ - నిర్మాతల మండలి - ప్రొడ్యూసర్స్ గిల్డ్ లక్ష్యం సమస్యలు పరిష్కరించుకోవడమే అని పేర్కొన్నారు. నెలల తరబడి షూటింగ్స్ ఆపాలన్న ఉద్దేశ్యం లేదని.. దీని వల్ల నిర్మాతలకు ఏదీ భారం కాకూడదని చూసుకుంటున్నామని వివరించారు.