త్రివిక్రమ్ కూడా అదే బాటలో వెళ్తున్నాడా..?

Wed Sep 28 2022 23:00:01 GMT+0530 (India Standard Time)

Is Trivikram also following the same path?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ భారీ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశారు.'అతడు' 'ఖలేజా' సినిమాల తర్వాత మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ ఇది గతంలో చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా.. హై వోల్టేజ్ ఎపిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ప్రకటించారు.

అయితే పుష్కర కాలం తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా మార్చడానికి త్రివిక్రమ్ తన కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా ఓ ఐటమ్ సాంగ్ ని పెట్టాలని యోచిస్తున్నారని తాజాగా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

తెలుగులో స్పెషల్ సాంగ్స్ జోలికి వెళ్ళని దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న దర్శకుడు.. కథలో భాగంగానే పాటలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటుంటారు. అందుకే ఇప్పటి వరకూ ఐటమ్ సాంగ్స్ గురించి ఆలోచించలేదు.

ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లు అందరూ తమ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ పెడుతూ వస్తున్నారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ లాంటి దర్శకుడు కూడా ఇటీవల ఐటమ్ సాంగ్స్ విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ సైతం 'ఐటమ్' బాట పట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మహేష్ బాబు గత చిత్రాల్లో ఐటెం పాటలు ఉన్నాయి కానీ.. త్రివిక్రమ్ తో చేసిన రెండు సినిమాల్లోనూ అలాంటి ప్రత్యేక గీతానికి చోటు కల్పించలేదు. కానీ SSMB28 అనేది ప్రతిష్టాత్మకమైన హ్యాట్రిక్ మూవీ కావడం.. ఐటమ్ సాంగ్ పెట్టడానికి అవకాశం ఉండటంతో తొలిసారి ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

ఇప్పటికే ఐటమ్ భామ కోసం త్రివిక్రమ్ పలువురు పాపులర్ హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నారట. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సైతం ఓ మాస్ డ్యాన్స్ నంబర్ ని కంపోజ్ చేస్తున్నారని అంటున్నారు. ఇదే నిజమైతే తొలి ఐటెం సాంగ్ తో త్రివిక్రమ్ తన ప్రత్యేకత చాటుకుంటారేమో వేచి చూడాలి.

కాగా SSMB28 లో మహేష్ బాబు మాస్ అవతార్ లో కనిపించనున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ లో ప్రారంభమయ్యే కొత్త షెడ్యూల్ లో మహేష్ తో పాటుగా పూజా కూడా పాల్గొనుంది. త్వరలోనే మిగతా ప్రధాన నటీనటుల వివరాలు వెల్లడి కానున్నాయి.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై కె రాధాకృష్ణ (చిన్నబాబు) భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2023 ఏప్రిల్ 28న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే షూటింగ్ జరిగేలా చూసుకుంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.