Begin typing your search above and press return to search.

వైజాగ్ కి ఇండస్ట్రీ తరలిపోతే ఆ రెండు ఫ్యామిలీలు మాత్రమే లాభపడతాయా...?

By:  Tupaki Desk   |   17 Jun 2020 9:10 AM GMT
వైజాగ్ కి ఇండస్ట్రీ తరలిపోతే ఆ రెండు ఫ్యామిలీలు మాత్రమే లాభపడతాయా...?
X
తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతూ వచ్చింది. రాష్ట్ర రాజధాని కావడంతో స్టూడియోల నిర్మాణం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్మించి ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేశారు. రామోజీ ఫిలింసిటీ, అన్నపూర్ణ స్టూడియో, రామకృష్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, సారధి స్టూడియో లాంటి నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయింది. దీంతో టాలీవుడ్ అభివృద్ధి అనేది దాదాపుగా తెలంగాణాకే పరిమితమైంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులు చిత్ర పరిశ్రమని ఏపీలో కూడా అభివృద్ధి చేయాలని అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. దీనికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని.. సినీ స్టూడియోల నిర్మాణాలకు రాయితీలు కలిపిస్తామని.. సినిమా వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని.. వారికి ప్రోత్సహకాలు అందిస్తామని భరోసా ఇచ్చింది. అంతేకాకుండా వైజాగ్ ప్రాంతంలో ఇప్పటికే చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో టాలీవుడ్ డెవలప్మెంట్ చేసుకోవాలని సూచించింది. అయితే ఏపీ సీఎంతో భేటీకి ఇండస్ట్రీలోని కొందరు మాత్రమే వెళ్లడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తం చేశారు.

అంతేకాకుండా వైజాగ్ కి ఇండ‌స్ట్రీని త‌ర‌లిస్తే రెండు ఫ్యామిలీలు మాత్ర‌మే బాగా బాగుప‌డతాయని కామెంట్స్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ సురేశ్ బాబుకి ఆల్రేడీ వైజాగ్ లో స్టూడియో ఉందని.. అలానే అల్లు అర‌వింద్ కి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్థాలాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీ మొత్తం వారి గుప్పింట్లో ఉంటుందని విమర్శలు వస్తుంటే ఇక వైజాగ్ లో కూడా అలాంటి పరిస్థితే వస్తుందని.. మిగిలిన వారంతా మ‌ళ్లీ వారి క్రింద ప‌నిచేయాల్సిందే అని కొంద‌రు సినీ పెద్ద‌లు వాపోతున్నారట. అస‌లు వైజాగ్ కి ఇండ‌స్ట్రీ త‌రిలిపోతే వ‌చ్చే మార్పులు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారట. సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీని డామినేట్ చేస్తున్న వారికి స్టూడియోలు కట్టుకోడానికి ప‌ర్మిష‌న్స్ ఇవ్వడం కంటే కొత్తవారికి అవ‌కాశం ఇస్తే బాగుంటుందని.. అంద‌రికి స‌మ‌న్వ‌యం జరిగేలా చూస్తే ఇండ‌స్ట్రీలో చాలా మంది వైజాగ్ బాట ప‌డ‌తారని వారు అభిప్రాయపడుతున్నారట.