స్టార్ ప్రొడక్షన్ హౌస్.. సౌత్ ని రూల్ చేయబోతోందా?

Tue Jun 28 2022 18:00:01 GMT+0530 (IST)

Is Star Production House going to rule the South?

టాలీవుడ్ లో చాలా వరకు క్రేజీ ప్రొడక్షన్ హౌస్ లు వున్నాయి. కానీ అందులో ఒకే ఒక్క సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్'. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. స్టార్ హీరోల నుంచి స్మాల్ హీరోస్ వరకు భారీ ప్రాజెక్ట్ ల నుంచి లో బడ్జెట్ మూవీస్ వరకు నిర్మిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. 2015లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 'శ్రీమంతుడు' మూవీతో నిర్మాణ రంగంలోకి రంగ ప్రవేశం చేశారు. తొలి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు.అదే ఉత్సాహంతో బ్లాక్ బస్టర్ హిట్ లు సూపర్ హిట్ లని సొంతం చేసుకుంటూ అనతి కాలంలోనే టాలీవుడ్ లో మోస్ట్ టాప్ ప్రొడక్షన్ హౌస్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరకు పలువురు క్రేజీ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి బాబితో 'వాల్తేరు వీరయ్య' మూవీ నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేనితో మరో మూవీ.. విజయ్ దేవరకొండ - సమంత తో 'ఖుషీ' సుకుమార్ - బన్నీతో 'పుష్ప 2' సినిమాల నిర్మిస్తూ చిన్న సినిమాలైన 'హ్యాపీ బర్త్ డే' 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' కిరణ్ అబ్బవరం తో ఓ మూవీని చేస్తోంది.  

ఈ ఏడాది ఇప్పటికే రెండు భారీ చిత్రాలని విడుదల చేసింది. సూపర్ స్టార్ మహేష్ - పరశురామ్ లతో నిర్మించిన 'సర్కారు వారి పాట' భారీ అంచనాల మధ్య మే 12న వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయింది.  భారీ అంచనాలతో ఎదురుచూసిన మహేష్ ఫ్యాన్స్ కి ఈ మూవీ తీవ్ర నిరావనే మిగిల్చింది. ఇక ఇదే సంస్థ నుంచి నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన చిత్రం 'అంలే సుందరానికి'. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ టాక్ బాగున్నా థియేర్లలో జనాలు లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది.  

ఈ రెండు సినిమాల తరువాత ఈ భారీ ప్రొడక్షన్ హౌస్ చేతిలో మొత్తం చిన్నా చితకా సినిమాలే కాకుండా భారీ మూవీస్ అన్నీ కలిపి మొత్తం ఆరు ప్రాజెక్ట్ లున్నాయి. ఇదిలా వుంటే ఈ సంస్థ సౌత్ ని రూల్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే మలయాళంలో హీరో టివినో థామస్ తో కలిసి 'అద్రిశ్య జలకంగల్' పేరుతో ఓ సినిమాని నిర్మిస్తూ మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటిస్తూ మ్యూజిక్ డైరెక్టర్ గా గ్రామీ అవార్డ్ విన్నర్ రికీ కేజుని తమ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనల్ చేసినట్టు ప్రకటించారు.

తాజాగా మలయాళంలో మరో భారీ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకోవడం విశేషం. మలయాళం ఇండస్ట్రీలో బ్యాక్ కు బ్యాక్ సూపర్ హిట్ లతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ తో మైత్రీ వారు ఓ మూవీకి శ్రీకారం చుట్టబోతున్నారట. ఈ మూవీ తెలుగులో వుండే అవకాశం వుందని తెలుస్తోంది. అంతే కాకుండా పృథ్వీరాజ్ తెలుగులో ఓ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు కూడా. ఈ రెండు సినిమాలని మైత్రీనే నిర్మించబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక హిందీలోకి కూడా ఈ సంస్థ ఎంట్రీ ఇవ్వడానికి చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఓ భారీ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్ శ్రీకారం చుట్టబోతున్నారని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికి రానున్నట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే మైత్రీ వారు సౌత్ ని రూల్ చేయడం సౌత్ తో పాటు ఉత్తరాదిలోనూ పాగా వేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.