శేఖర్ కమ్ముల డ్రీమ్ నెరవేరేనా?

Thu Aug 18 2022 06:00:01 GMT+0530 (IST)

Is Shekhar Kammula's dream come true?

టాలీవుడ్ లో శేఖర్ కమ్ములకు సెన్సిబుల్ మూవీస్ డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు వుంది. ఆయన సినిమాలని ఇష్టపడని స్టార్ లేరంటే అది అతిశయోక్తి కాదేమో. తను అనుకున్న కథని అంతే నిజాయితీగా ఎమోషన్స్ ని జోడించి తెరకెక్కించడంతో శేఖర్ కమ్ముల శైలి ప్రత్యేకంగా. అందుకే ఆయన సినిమాలంటే స్టార్స్ కూడా ప్రత్యేక ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే ఆయనకు మాత్రం ఓ డ్రీమ్ వుంది. ఎప్పటికైనా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమాలు చేయాలన్నది ఆయన కల.రెండు మూడు సార్లు ట్రై చేసి విఫలమయ్యారు కూడా. 'ఫిదా' సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయాలనుకున్నారు. అయితే ఆయన ఈ కథ చేయడానికి సున్నితంగా తిరస్కరించారట. ఇది హీరోయిన్ ప్రధానంగా సన్నితమైన భావోద్వేగాల సమారంగా సాగే క్యూట్ లవ్ స్టోరీ. దీని సోల్ ని చెడగొట్టడం ఇష్టం లేకే మహేష్ బాబు చేయనని చెప్పారట. అయితే త్వరలో మహేష్ బాబు తో శేఖర్ కమ్ముల సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

దగ్గుబాటి రానాని హీరోగా పరిచయం చేస్తూ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్ గత కొన్నేళ్ల క్రితం 'లీడర్' మూవీని నిర్మించిన విషయం తెలిసిందే. సమకాలీన రాజకీయాంశాల నేపథ్యంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా విర్శకుల ప్రశంసల్ని సైతం సొంతం చేసుకుంది. హీరోగా రానాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ మూవీకి సీక్వెల్ గా 'లీడర్ 2' రానుందంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి.

రజనీకాంత్ తో ఈ మూవీ చేసే అవకాశం వుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ దీనిపై శేఖర్ కమ్ముల స్పందించకపోవడంతో ఇది వట్టి రూమరే అని తేలిపోయింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో 'లీడర్ 2' ని శేఖర్ కమ్ముల చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వరుస కథనాలు వినిపిస్తున్నాయి. ఏవీఎం ప్రొడక్షన్స్ నేటి తరం నిర్మాతల్లో ఒకరైన అరుణ గుహ తాజాగా 'లీడర్2'పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.

ఈ విషయమై ఆమెని ప్రశ్నిస్తే.. దీనికి సంబంధించిన చర్చలు జరిగాయని ఇంత వరకు అవి కొలిక్కి రాలేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా మేము గమనిస్తూ ముందుకు వెళ్లాలనుకుంటున్నామని తెలిపారు.

అయితే భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా మహేష్ బాబు పవన్ కల్యాణ్ చిరంజీవి వంటి తెలుగు స్టార్స్ తో కలిసి పని చేయాలనుకుంటున్నామని అసలు విషయం బయటపెట్టారు. ఇదే సందర్భంగా రజనీకాంత్ - శంకర్ ల కలయికలో వచ్చిన 'శివాజీ' సీక్వెల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్ట్ 1 కంటే పార్ట్ 2 కథ మరింత శక్తివంతంగా వుంటుందని స్పష్టం చేయడం విశేషం.