రామ్ చరణ్ రిస్క్ చేస్తున్నాడా...?

Sat Jul 04 2020 14:40:16 GMT+0530 (IST)

Is Ram Charan Daring To Give Chance To A Debutant?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామరాజు' పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్ నటించబోయే సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. కాకపోతే హోమ్ బ్యానర్ లో చిరంజీవి - కొరటాల శివ దర్శకత్వంలో రూపొందువుతున్న 'ఆచార్య' సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. కరోనా టైమ్ లో హీరోలందరూ కొత్త స్టోరీలను వింటూ వరుసగా ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్న క్రమంలో చరణ్ నెక్స్ట్ ఏ మూవీ చేయబోతున్నాడని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి సినిమా ఓ కొత్త డైరెక్టర్ తో ఉండబోతోందనే న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.కాగా రామ్ చరణ్ ఇటీవల సతీష్ అనే అప్ కమింగ్ డైరెక్టర్ చెప్పిన స్టోరీ లైన్ కి ఇంప్రెస్ అయ్యాడట. ఈ స్టోరీ లైన్ డెవలప్ చేసి కంప్లీట్ స్క్రిప్ట్ తీసుకురమ్మని సతీష్ కి సూచించాడట. అయితే ఇప్పుడు ఈ సినిమా కంఫర్మ్ అయిందని.. సతీష్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేయబోతున్నారని..అంతేకాకుండా ఈ సినిమాకి 'సభకు నమస్కారం' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని సోషల్ మీడియాలో ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ఇక చరణ్ కూడా 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత హైప్ లేకుండా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేసిన హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్ ఉంది. రామ్ చరణ్ ఆల్రెడీ ఒకసారి ఈ సెంటిమెంటుకి బలయ్యారు.

'మగధీర' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత 'ఆరెంజ్' లాంటి ప్లాప్ సినిమా రుచి చూశాడు చరణ్. ఈ నేపథ్యంలో 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత మరోసారి అది రిపీట్ కాకుండా చూసుకోవాలని చరణ్ అనుకుంటున్నాడని.. అందుకే అంచనాలు లేకుండా కొత్త డైరెక్టర్ తో సినిమా చేయడానికి సుముఖంగా ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే రామ్ చరణ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు డెబ్యూ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వలేదు. కాకపోతే 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత వచ్చే పాన్ ఇండియా స్టార్ డమ్ ని పక్కన పెట్టి డెబ్యూ డైరెక్టర్ తో సినిమా తీసి చరణ్ రిస్క్ చేస్తాడేమో అని మెగా ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.