Begin typing your search above and press return to search.

'ఆర్ఆర్ఆర్' భయానికి కారణం అదేనా?

By:  Tupaki Desk   |   22 May 2022 4:30 AM GMT
ఆర్ఆర్ఆర్ భయానికి కారణం అదేనా?
X
రాజమౌళి ‘బాహుబలి’తో పోల్చి చూస్తే.. ఆయన తర్వాతి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఎంత మాత్రం సరితూగదన్నది ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ తెలుగు రాష్ట్రాల వరకు వసూళ్ల పరంగా చూసుకుంటే.. 'ఆర్ఆర్ఆర్' 50 శాతం ఎక్కువే కలెక్ట్ చేసింది. దీనికి కారణం.. భారీగా పెరిగిన టికెట్ల ధరలు.

మామూలుగానే ఐదేళ్ల కిందటితో పోలిస్తే 75 నుంచి 100 శాతం ధరలు పెరగ్గా.. అవి చాలవని రెండు వారాల పాటు అదనపు ధరలు వడ్డించారు. జనాలకు ఇది ఏమాత్రం రుచించని విషయమే అయినా.. సినిమాకున్న క్రేజ్ వల్ల తిట్టుకుంటూనే ఆ రేట్లు పెట్టి సినిమా చూశారు. అయితే అది చాలదని ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను కొన్ని జీ5 సంస్థ కూడా ఓటీటీలో అదనంగా డబ్బులు రాబట్టుకోవాలని చూసింది. నేరుగా సబ్‌స్క్రైబర్లకు సినిమాను అందించకుండా.. పే పర్ వ్యూ అంటూ ఎక్స్‌ట్రా రేటు పెట్టింది. దీని పట్ల ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఐతే ప్రిమియర్స్ మొదలు కాకముందే, ఈ నిర్ణయాన్ని మార్చుకుని సబ్‌స్క్రైబర్లకు ఉచితంగానే సినిమాను అందించాలని నిర్ణయంచుకుంది.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ప్రేక్షకుల డిమాండ్ మేరకే ఇలా చేసినట్లు జీ5 సంస్థ ప్రకటించింది. కానీ ఇలా చేయడం వెనుక వేరే కారణం ఉంది. ఈ మధ్య ‘ఐ బొమ్మ’ లాంటి కొన్ని పైరసీ వెబ్ సైట్లు ఓటీటీలో సినిమా రిలీజ్ కావడం హెచ్డీ ప్రింట్‌ను ఆన్ లైన్లోకి అందుబాటులోకి తెచ్చేస్తున్నాయి. తక్కువ డబ్బుతో ఎక్కువ వినోదం ఇచ్చే ఓటీటీలకు అలవాటు పడ్డాక.. మధ్యలో పైరసీ వెబ్ సైట్లకు జనం దూరమవుతూ వచ్చారు. క్లారిటీ లేని పైరసీ ప్రింట్లను పక్కన పెట్టడం మొదలైంది.

కానీ ఈ మధ్య ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల రేట్లు పెరిగిపోతుండటం, మరోవైపు థియేటర్లలో అయిన కాడికి రేట్లు పెట్టి వాయించేస్తుండటంతో మళ్లీ పైరసీవెబ్ సైట్ల ఊపు పెరిగింది. అందులోనూ ‘ఐబొమ్మ’ లాంటి సైట్లు అయితే మంచి క్వాలిటీతో కొత్త సినిమాలను అందిస్తున్నాయి. మొన్న కేజీఎఫ్-2 సినిమాను పే పర్ వ్యూ పద్ధతిలో అమేజాన్ ప్రైమ్ వాళ్లు రిలీజ్ చేయగా.. కొన్ని గంటల్లోనే ఐ బొమ్మలో అదిరే ప్రింటు అందుబాటులోకి వచ్చింది.

దీని వల్ల ఓటీటీల్లో వ్యూస్ పడిపోతున్నాయి. సబ్‌స్క్రిప్షన్లు ఆశించిన స్థాయిలో రావట్లేదు. పే పర్ వ్యూ పద్ధతిలో వచ్చే ఆదాయంతో పోలిస్తే.. దాని వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఉంటోందన్నది స్పష్టం. జనాలు అసలే థియేటర్లలో ఎక్కువ రేటు పెట్టి ‘ఆర్ఆర్ఆర్’ చూడటం పట్ల ఆగ్రహంతో ఉన్నారు.

ఇక ఓటీటీల్లోనూ అదనంగా డబ్బులు పెట్టాలంటే వాళ్ల ఆలోచన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీని వల్ల కొత్త సబ్‌స్క్రిప్షన్లు రాకపోవచ్చు, వ్యూస్ తగ్గిపోవచ్చు. ఇది దీర్ఘ కాలంలో ప్రతికూల ప్రభావం చూపుతుంది. పైరసీ వెబ్ సైట్లకు మరింత అలవాటు పడతారు. అందుకే అన్నీ ఆలోచించుకుని ‘ఆర్ఆర్ఆర్’ సబ్‌స్క్రైబర్లకు ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నట్లున్నారు.