Begin typing your search above and press return to search.

అడ్డాల కెరీర్ కు 'నారప్ప' ప్లస్ అయ్యాడా..?

By:  Tupaki Desk   |   21 July 2021 2:31 AM GMT
అడ్డాల కెరీర్ కు నారప్ప ప్లస్ అయ్యాడా..?
X
'కొత్త బంగారు లోకం' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీకాంత్ అడ్డాల ఫస్ట్ మూవీతోనే మంచి విజయం అందుకున్నాడు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు - విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె' సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఈ సెన్సిబుల్ డైరెక్టర్. 'ముకుంద' చిత్రంతో మెగా హీరోని లాంచ్ చేసిన శ్రీకాంత్ అడ్డాల.. మహేష్ తో 'బ్రహ్మోత్సవం' సినిమా చేసి భారీ పరాజయం అందుకున్నాడు. దీంతో దర్శకుడికి ఏకంగా నాలుగేళ్ల గ్యాప్ వచ్చింది. మధ్యలో నలుగురైదుగురు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ట్రై చేసినా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ విక్టరీ వెంకటేష్ తో ''నారప్ప'' చిత్రంతో విక్టరీ కొట్టడానికి వచ్చాడు అడ్డాల శ్రీకాంత్.

తమిళంలో వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన 'అసురన్' చిత్రాన్ని తెలుగులో ''నారప్ప'' గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్సన్ ని నిర్మించిన వి క్రియేషన్స్ ఎస్. థాను.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు తో కలిసి నిర్మించారు. ఇన్నాళ్లూ థియేట్రికల్ రిలీజ్ కోసం చూసిన మేకర్స్.. చివరకు మంచి ఓటీటీ డీల్ రావడంతో డిజిటల్ రిలీజ్ కే మొగ్గుచూపారు. సోమవారం రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. విమర్శకుల నుంచి జ‌న‌ర‌ల్ ఆడియెన్స్ వ‌రుకు వెంకీని పెర్ఫార్మెన్స్ ని మెచ్చుకుంటున్నారు. అయితే ఒరిజినల్ తో పోలిస్తే కొంచం ఇంపాక్ట్ తగ్గిందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది డైరెక్ట‌ర్ గా శ్రీకాంత్ అడ్డాల‌ కి ఎంత పేరు తీసుకువ‌స్తుంద‌న్న‌దే తేలాల్సి ఉంది.

ఎందుకంటే 'నారప్ప' సినిమా చూసిన వారు సీన్ టు సీన్.. ఫ్రేమ్ టు ఫ్రేమ్ తమిళ చిత్రాన్ని ఫాలో అయ్యారని కామెంట్స్ చేస్తున్నారు. అనంతపురం బ్యాక్ డ్రాప్ ని తీసుకొని ప్రతి విషయంలోనూ మక్కీకి మక్కీ దించేశారని అంటున్నారు. ఆల్రెడీ హిట్ అయిన సినిమాలోని సోల్ మిస్ అవుతుందనో ఏమో.. మేకర్స్ మార్పులు చేర్పుల జోలికి వెళ్లలేదని తెలుస్తోంది. నటీనటులను మార్చి సేమ్ డైలాగ్స్ - యాక్షన్ సీన్స్ - బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో సహా 'అసురన్' చిత్రాన్ని అనుసరించారని కామెంట్స్ వస్తున్నాయి. ఇందులో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రతిభ ఏమీ కనిపించలేదని.. కాకపోతే అతని కెరీర్ లో డిఫరెంట్ జానర్ సినిమాగా చెప్పుకోడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు.

అంతేకాదు ఉన్నది ఉన్నట్లు కాపీ చేయడానికి రీమేక్ చేయడం ఎందుకు అనేవారు కూడా లేకపోలేదు. కాకపోతే రీమేక్ సినిమా అంటే ఇలానే తీయాలి.. అలా తీయకూడదు.. అలాంటి మార్పులు చేర్పులు చేయాలి.. అనే రూల్స్ ఏమి లేవు కాబట్టి.. ఫిలిం మేకర్స్ ని ఈ విషయంలో ప్రశ్నించాల్సింది ఏమీ లేదు. కానీ దర్శకుడి కెరీర్ కు ఏ మేరకు ఈ సినిమా ప్లస్ అయిందనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే 'నారప్ప' విషయంలో శ్రీకాంత్ దర్శకత్వం గురించి పెద్దగా మాట్లాడటం లేదని తెలుస్తోంది. మరి ఇంకో రెండు రోజుల తర్వాత అయినా అతని డైరెక్షన్ స్కిల్స్ కి ఎన్ని మార్కులు వ‌స్తాయో చూడాలి.

అయితే 'నార‌ప్ప' ప్రేక్షకుల ముందుకు రాకముందే శ్రీకాంత్ అడ్డాల కు ఆల్రెడీ క్రేజీ ఆఫర్ అందినట్లు తెలుస్తోంది. ఇటీవల 'నారప్ప' ప్రమోషన్స్ లో భాగంగా శ్రీకాంత్ తన తదుపరి సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. ''అన్నాయ్'' పేరుతో ఓ భారీ యాక్షన్ సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు. గుంటూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ పీరియాడికల్‌ డ్రామా మూడు భాగాలుగా రానుందని చెప్పారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పుడున్న మార్కెట్‌ కి ఈ కథ చక్కగా సరిపోతుందని.. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్‌ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోందని దర్శకుడు తెలిపారు. శ్రీకాంత్ అడ్డాల ఇందులో హీరో ఎవరనేది వెల్లడించనప్పటికీ.. శర్వానంద్ తో ఈ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.