Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కొత్త అడుగు వేయ‌బోతున్నారా?

By:  Tupaki Desk   |   7 July 2022 1:30 PM GMT
మెగాస్టార్ కొత్త అడుగు వేయ‌బోతున్నారా?
X
మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం మునుపెన్న‌డూ లేనంత‌గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ డైరెక్ష‌న్ లో 'ఆచార్య‌' మూవీతో ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక పోయింది. ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. ఈ మూవీ విష‌యం ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం మెగాస్టార్ మూడు భారీ చిత్రాల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఇవి చిత్ర‌క‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి.

ఇదిలా వుంటే మెగాస్టార్ కొత్త అడుగు వేయ‌బోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఓ మ‌ల‌యాళ రీమేక్‌, త‌మిళ రీమేక్ తో పాటు ఓ ఒరిజిన‌ల్ స్టోరీతో రూపొందుతున్న మూవీలో న‌టిస్తున్నారు. అయితే త‌న స్థాయి. స్టార్ డ‌మ్ వున్న స‌మ‌కాలీన హీరోల‌కు ధీటుగా చిరు కొత్త అడుగు వేయ‌డానికి రెడీ అవుతున్నార‌ని వార్తలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం సినిమాల్లో న‌టిస్తూనే డేరింగ్ స్టెప్ వేయ‌బోతున్నార‌ట‌. అదే ఓటీటీ వ‌ర‌ల్డ్‌. ప్ర‌తీ ఒక్క‌రూ ఇప్పుడు సినిమాల్లో న‌టిస్తూనే ఓటీటీల్లోనూ న‌టిస్తూ అల‌రిస్తున్నారు.

బాలీవుడ్‌, కోలీవుడ్ లో ఈ సంప్ర‌దాయం ఇప్ప‌టికే మొద‌లైంది. తెలుగులో ఇప్పుడిప్పుడే స్టార్ట‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న తొలి సూప‌ర్ స్టార్ గా రికార్డు సాధించాలనే ఆలోచ‌న‌లో మెగాస్టార్ వున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇందు కోసం మంచి వెబ్ సిరీస్ కోసం అన్వేషిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే విక్ట‌రీ వెంక‌టేష్ నెట్ ఫ్లిక్స్ కోసం 'రానా నాయుడు' పేరుతో రూపొందుతున్న వెబ్ సిరీస్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే చిరు స్థాయి స్టార్స్ అయిన అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌జ‌నీకాంత్, మోహ‌న్ లాల్‌, మ‌మ్ముట్టి, స‌ల్మాన్ ఖాన్ వంటి సూప‌ర్ స్టార్స్ ఇంత వ‌ర‌కు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వ‌లేదు. అయితే వీరికంటే ముందే ఓటీటీలోకి ప్ర‌వేశించి స‌రికొత్త రికార్డుని సొంతం చేసుకోవాల‌ని మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇండియా వైడ్ గా పాపులారిటీని సొంతం చేసుకున్న రెండు దిగ్గ‌జ ఓటీటీ సంస్థ‌ల‌కు సంబంధించిన కంటెంట్ హెడ్ లు ఇప్ప‌టికే చిరుని క‌లిశార‌ని, చిరుని ఓ భారీ వెబ్ సిరీస్ కోసం ఒప్పించార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో న‌టిస్తూ వ‌స్తున్న చిరు వెబ్ సిరీస్ ల‌లో న‌టించ‌డం అంత ఆశామ‌షీ కాదు. కార‌ణం ఆయ‌న‌ని ప‌క్కాగా చూపించ‌గ‌లిగే స్క్రిప్ట్ లు కావాలి. అలా అని క‌మ‌ర్షియ‌ల్ హంగులు వుండ‌కూడ‌దు.

అలాంటి క‌థ‌లు అయితే చేయ‌డానికి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చిరు చెప్పార‌ట‌. అంతే కాకుండా ప్ర‌తినాయ‌కుడిగా కూడా క‌నిపించ‌డానికి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్పార‌ని కూడా తెలుస్తోంది. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది తెలియాలంటే అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.