అరవింద్ గారి పంచ్ మహేష్ పైనేనా?

Thu Jan 30 2020 23:00:01 GMT+0530 (IST)

Is Allu Arvind punch on Mahesh?

ప్రతిసారి సంక్రాంతికి సినిమాలు వస్తాయి.. పోటీపడతాయి. ఆ హంగామా సద్దుమణుగుతుంది. కానీ ఈసారి మాత్రం సంక్రాంతి సినిమాల హడావుడి మామూలుగా లేదు. సంక్రాంతి పండుగకు మూడు నెలల ముందు ప్రచార కార్యక్రమాల హంగామా మొదలైంది. అప్పటి నుంచి సినిమా రిలీజ్ అయిన వారం రోజుల వరకూ ప్రమోషన్లు పోటాపోటీగా కొనసాగాయి. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ కావడం ఆలస్యం మా సినిమా విన్నర్ అని ఒకరు.. మా సినిమా సంక్రాంతి మొగుడు అని మరొకరు ప్రచారం చేసుకున్నారు. నిన్న మొన్న ఇండస్ట్రీ హిట్ అని ఒకరంటే.. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అని మరొకరు పోస్టర్లు వేసుకున్నారు.ఈ స్థాయి సంక్రాంతి రచ్చ కనీవినీ ఎరుగనిది. ఇదిలా ఉంటే రీసెంట్ గా 'అల వైకుంఠపురములో' టీమ్ మీడియా ప్రతి నిథులతో ముచ్చటించారు. విలేఖరులు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. తమ సినిమా అద్భుతం.. ఇక బాహుబలి 2 మరుగున పడిపోవడమే ఆలస్యం అన్నట్టుగా మరో సారి నొక్కి ఒక్కాణించారు. 'అల వైకుంఠపురములో' నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ గారు ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ హీరోలకు.. డైరెక్టర్లకు కలెక్షన్ల వివరాలు డీప్ గా తెలియక పోవచ్చని.. వారికి సినిమా బాగా వచ్చిందా లేదా అనేదాని పైనే ఎక్కువ శ్రద్ధ ఉంటుందని.. రోజూ ఎంత వచ్చింది అని ఫిగర్స్ లెక్క పెట్టుకునేది నిర్మాతలం కాబట్టి తమకు ఆ లెక్కలు తెలిసి ఉంటాయని అన్నారు.

అయితే ఈ వ్యాఖ్యలు 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ ను ఉద్దేశించి అన్న మాటేనని కొందరు అర్థాలు తీస్తున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' రియల్ కలెక్షన్స్ అటు మహేష్ బాబుకు కానీ అనిల్ రావిపూడికి కానీ తెలియవని.. ఆ విషయం అసలు నిర్మాత అనిల్ సుంకర కు మాత్రమే తెలుసు అనే ఉద్దేశంలో అల్లువారు ఇలా పరోక్షంగా వ్యాఖ్యానించారని అంటున్నారు. నిజానికి ఈ విషయంపై ఇప్పటికే ఫిలిం నగర్ లో ఒక టాక్ ఉంది. మహేష్ కు తెలియకుండా 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్స్ ఎక్కువ చేసి చెప్తున్నారని.. ఇండస్ట్రీ హిట్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారని ఇప్పటికే గుసగుసలు ఉన్నాయి. ఇప్పుడు అల్లు అరవింద్ వ్యాఖ్యలు కూడా ఆ వాదనకు బలాన్నిచ్చేవిగా ఉండడం గమనార్హం.