'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' చిత్ర బృందంపై కేసు నమోదు..!

Tue Aug 03 2021 18:00:01 GMT+0530 (IST)

Case registered against ippudu kaka inkeppudu movie

హశ్వంత్ వంగా - నమ్రత దరేకర్ - కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు'. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణ (గోపి) నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. అయితే ఇందులో హిందువుల విశ్వాసాలను కించపరిచేలా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' చిత్ర బృందంపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.వివరాల్లోకి వెళ్తే.. 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' ట్రైలర్ లో శ్రీవేంకటేశ్వర స్వామిని పవిత్రంగా కీర్తించే ‘భజ గోవిందం’ కీర్తనను బెడ్ రూమ్ సన్నివేశాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ గా ఉపయోగించారని.. అలానే హిందూ దేవుళ్లను కించపరిచేలా సన్నివేశాలు సంభాషణలు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ మేరకు విహెచ్‌పి అధికార ప్రతినిధి రావినూతన శశిధర్ మరియు బీజేపీ మల్కాజ్ గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ పోచంపల్లి గిరిధర్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా కంప్లైంట్ చేశారు.

'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' ట్రైలర్ అభ్యంతరకరంగా హిందువుల విశ్వాసాలను గాయపరించేలా ఉందని.. దర్శకనిర్మాతలతో పాటు చిత్ర బృందం పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో కోరారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకుంటే సినిమా విడుదల అడ్డుకుంటామని విహెచ్‌పి నేతలు హెచ్చరించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇకపోతే సోషల్ మీడియాలో కూడా ఈ ట్రైలర్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను వీక్షించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు చిత్ర యూనిట్‌పై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే చిత్ర యూనిట్ కు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది.