'లవ్ స్టోరీ' మీదనే ఇండస్ట్రీ ఆశలన్నీ..!

Wed Sep 22 2021 05:00:02 GMT+0530 (IST)

Industry hopes on Love Story

కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ పెద్ద సినిమాలేవీ విడుదల కాలేదు. జనాలు సినిమాలు చూడటానికి థియేటర్లకు వస్తారో రారో అనే సందేహంతో ఫిలిం మేకర్స్ అందరూ వెనకడుగు వేశారు. దీని క్యాష్ చేసుకోడానికి వారానికి ఒక అర డజను చొప్పున చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ.. జనాలను థియేటర్లకు రప్పించలేకపోయాయి. వాటిలో ఒకటీ అర చిత్రాలు బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్నా.. టాలీవుడ్ బాక్సాఫీస్ లు ఊపు తెచ్చే వసూళ్లయితే రాబట్టలేదు. ఇలాంటి సమయంలో ఇప్పుడు ''లవ్ స్టోరీ'' సినిమా థియేటర్లలోకి వస్తోంది.అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన ''లవ్ స్టొరీ'' చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాని సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సెకండ్ వేవ్ పాండమిక్ తర్వాత థియేట్రికల్ రిలీజ్ అవుతున్న క్రేజీ మూవీ ఇదే. అందుకే సినీ అభిమానులతో పాటుగా చిత్ర పరిశ్రమ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమాతో మళ్లీ థియేటర్లు పుంజుకుంటాయని.. టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపిరి పోస్తుందని అందరూ ఆశాభావంతో ఉన్నారు.

అంతేకాదు 'లవ్ స్టోరీ' సినిమా సక్సెస్ ని బట్టి రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల విడుదలలు ప్లాన్ చేసుకోవాలని చూస్తున్నారు. అందుకే ఈ ఫీల్ గుడ్ ప్రేమకథా చిత్రం విజయం మొత్తం సినిమా పరిశ్రమకు చాలా కీలకమని చెప్పవచ్చు. నాగచైతన్య చిత్రానికి హిట్ టాక్ వచ్చి నాలుగో రోజు కలెక్షన్లు డ్రాప్ అవ్వకపోతే మాత్రం ఇది రికార్డ్ స్థాయి వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే 30 కోట్లు పైనే ఖర్చు పెట్టి చేసిన సినిమాలన్నీ వరుసగా థియేటర్లకు క్యూలు కట్టేస్తాయి.  

ఒకవేళ 'లవ్ స్టోరీ' అందరి ఆశల్ని అడియాసలు చేసి ఇందుకు విరుద్ధంగా ఏమైనా జరిగితే మాత్రం ఫిలిం మేకర్స్ అందరూ మళ్ళీ ఆలోచనలో పడతారు. ఈ క్రమంలో క్రేజీ మూవీస్ అన్నీ ఓటీటీ బాట పట్టినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. దీంతో మరోసారి ఓటీటీల పంట పండుతుంది. ప్రస్తుతానికి అయితే లవ్ స్టొరీ అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. ఈ సినిమాపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయడానికి ఇదే నిదర్శనం.

ఇప్పటికే విడుదలైన 'లవ్ స్టోరీ' ట్రైలర్ - సాంగ్స్ విశేష స్పందన తెచ్చుకొని సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. శేఖర్ కమ్ముల - నాగచైతన్య - సాయి పల్లవి కలిసి సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ కచేయబోతున్నారనే నమ్మకాన్ని కలిగించాయి. ఇది శేఖర్ కమ్ముల గత చిత్రాల మాదిరిగానే ఫీల్ గుడ్ మూవీ. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకథతోపాటు సమాజంలోని ఓ ప్రధాన సమస్యను రెండు ప్రధాన అంశాలను ఈ చిత్రంలో ప్రస్తావించబోతున్నారని తెలుస్తోంది.

'లవ్ స్టోరీ' చిత్రంలో అణగారిన వర్గం నుంచి వచ్చిన యువకుడి పాత్రలో నాగచైతన్య.. అగ్ర కులానికి చెందిన అమ్మాయిగా సాయి పల్లవి కనిపించనున్నారు. సమాజంలో ఉండే కుల సమస్యతో పాటు స్త్రీ పట్ల ఉండే వివక్షను కూడా ఈ సినిమా ద్వారా తెరపై శేఖర్ కమ్ముల ఆవిష్కరిస్తున్నారు. మరి ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందిన ''లవ్ స్టోరీ'' చిత్రాన్ని నారాయణ దాస్ కె. నారంగ్ - పి. రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి పవన్ సిహెచ్ సంగీతం సమకూర్చగా.. విజయ్ సి. కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల - ఈశ్వరీ రావు - దేవయాని - ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.