సెట్లో ఆడాళ్లకు టాయ్ లెట్లు లేని కాలంలో!

Mon May 03 2021 19:00:01 GMT+0530 (IST)

In a time when there were no toilets for the ladies on the set!

ఆర్.మాధవన్ .. విక్టరీ వెంకటేష్ .. సూర్య వంటి టాప్ రేంజ్ హీరోలను డైరెక్ట్ చేసిన మహిళా దర్శకురాలిగా సుధ కొంగర పేరు మార్మోగింది. గురు సినిమాతో విక్టరీ వెంకటేష్ (తమిళ వెర్షన్ లో మ్యాడీ)ని మరో కొత్త కోణంలో ఆవిష్కరించిన సుధ కొంగర ప్రతిభకు అబ్బురపడని వారు లేరు.ఇటీవలే సింగం సూర్యను ఆకాశం నీ హద్దురా చిత్రంలో ఎంతో గొప్ప పాత్రలో ఆవిష్కరించారు. చాలా కాలానికి సూర్యకు ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఘనత తన సొంతమైంది. చవక టిక్కెట్టుతో సామాన్యుల విమాన ప్రయాణం కోసం విమానయాన సంస్థను ప్రారంభించిన గొప్ప పరిశోధకుడు ఎయిర్ డెక్కన్ గోపీనాథ్ జీవితకథతో బయోపిక్ కేటగిరీలో ఎంతో ఎమోషనల్ గా సినిమాని తెరకెక్కించారు సుధ. ఈ చిత్రంలో సూర్య పాత్రతో పాటు కథానాయికను ఎలివేట్ చేసిన తీరు ప్రశంసలు అందుకుంది.

ఆకాశం నీ హద్దురా చిత్రం OTT విడుదల అయినప్పటికీ చాలా సంవత్సరాల తరువాత సూర్యకు అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దర్శకురాలిగా సుధా కొంగర ప్రతిభకు హ్యాట్సాఫ్ చెప్పనివారు లేరు. అయితే సుధా కొంగరకు ఈ అవకాశాలు అంత సులువుగా దక్కాయా? అంటే అది దశాబ్ధాల కృషి.. హార్డ్ వర్క్ తోనే సాధ్యమైంది. ఎన్నిటినో అధిగమిస్తేనే పాజిబుల్ అయ్యింది.

సుధ తన మేల్ ప్రత్యర్ధులతో పోటీ పడటానికి అవసరమైన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది. మహిళా దర్శకురాలు ముఖ్యంగా ఏస్ డైరెక్టర్ మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. నాటి కాలంలో ఆడవారికి ఆన్ లొకేషన్ ఎలాంటి ఇబ్బందులు ఉండేవో సుధ కొంగర తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిజానికి సెట్లో 200 మందికి టాయ్ లెట్ల ఏర్పాటు ఆషామాషీ కాదు. అందులో ఆడవారికి సమ ప్రాధాన్యత అనేది చాలా కష్టమైనది. నాటి రోజుల్లో మణిరత్నం సర్ ఫెమినిస్టుగా ఉన్నారు కాబట్టే మాకు అనుకూలంగా ఉండేదని తెలిపారు. మణి సర్ తన టీమ్ లో ఆడ మగ అనే విభేధం ఏనాడూ చూడలేదు. అందరినీ ప్రోత్సహించేవారు.

కానీ అప్పటికి ప్రత్యేక మరుగుదొడ్ల ఏర్పాటుకు మార్గం లేదు. మహిళా సాంకేతిక నిపుణులకు పరిస్థితులు అనుకూలంగా లేని రోజులవి. నాటి కాల సమస్యలు అలాంటివి.. అని అన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడ్డాయి. మహిళా సాంకేతిక నిపుణులుగా తమకు తగిన గౌరవం లభిస్తోందని సుధా కొంగరా వెల్లడించారు. ఇటీవల స్టార్ హీరోలు అవకాశాలిచ్చి తనను ప్రోత్సహిస్తున్నారు. ఇది గొప్ప అఛీవ్ మెంట్ అని ప్రశంసించాలి.