'సెహరి' కోసం సిద్ శ్రీరామ్ పాడిన 'ఇది చాలా బాగుందిలే' సాంగ్..!

Thu Jul 29 2021 17:14:03 GMT+0530 (IST)

Idhi Chala Bagundhile song sung by Sid Sriram

హర్ష కనుమల్లి - సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ "సెహరి'. జ్ఞాన సాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - 'సెహరి' టైటిల్ సాంగ్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా చిత్రంలోని ''ఇది చాలా బాగుందిలే'' అనే మరో పాట లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.''ఓ కలలా.. ఇన్నాల్లే నిన్ను దాచే లోకమే.. ఓ కథలా.. ఇవ్వాలే చూపిస్తుంటే చాలులే.." అంటూ సాగిన ఈ సోల్ ఫుల్ మెలోడీ విశేషంగా ఆకట్టుకుంటోంది. యువ సింగర్ సిద్ శ్రీరామ్ ఎప్పటిలానే తన అద్భుతమైన గాత్రంతో మ్యాజిక్ రిపీట్ చేసి శ్రోతల హృదయాన్ని హత్తుకున్నాడు. ఈ పాటకు ప్రశాంత్ ఆర్ విహారీ స్వరాలు సమకూర్చగా.. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు.

'ఇది చాలా బాగుందిలే' పాట ద్వారా హీరోయిన్ మీద తనకున్న రొమాంటిక్ ఫిలింగ్స్ ని హీరో వెల్లడిస్తున్నట్లు అర్థం అవుతుంది. ఈ సాంగ్ లో హర్ష - సిమ్రాన్ అందంగా కనిపిస్తున్నారు. ఇద్దరి హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. యష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో హీరో హర్ష వేసిన సింపుల్ స్టెప్స్ అలరిస్తున్నాయి. సిద్ శ్రీరామ్ మార్క్ చూపించిన ఈ గీతం ఈ ఏడాది చార్ట్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిపోనుంది.

'సెహరి' చిత్రాన్ని విర్గో పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా అద్వయ జిష్ణు రెడ్డి - శిల్పా చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హీరో హర్ష కనుమల్లి కథ అందిస్తుండటం విశేషం. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. రవితేజ గిరజాల ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు కోటి కీలక పాత్ర పోషిస్తున్నారు. అభినవ్ గోమఠం - ప్రణీత్ రెడ్డి - అనిషా అల్లా - అక్షిత హరీష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.