ఐకాన్ అప్డేట్.. పాన్ ఇండియా స్క్రిప్ట్ మరియు స్టార్స్!

Thu Sep 16 2021 12:01:05 GMT+0530 (IST)

Icon update? .. Pan India script? and Stars?!

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 1 షూటింగ్ లో ఉన్నాడు. పుష్ప చివరి దశ షూటింగ్ నడుస్తున్న నేపథ్యంలో తదుపరి మొదలు అవ్వాల్సిన ఐకాన్ సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఐకాన్ సినిమాను బన్నీ పాన్ ఇండియా రేంజ్ లో చేయాలని ఆశ పడుతున్నాడు. అందుకు తగ్గట్లుగా గతంలో వేణు శ్రీరామ్ తయారు చేసిన కథను మార్చడం జరిగింది. బన్నీ తనకు సన్నిహితులైన రచయితలకు ఆ పని అప్పగించారు. వారు వేణు శ్రీరామ్ తో కలిసి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. పాన్ ఇండియా మూవీ అంటే బడ్జెట్ కూ డా పెరుగుతుంది. దానికి తగ్గట్లుగా నిర్మాత దిల్ రాజు కూడా రెడీ అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఐకాన్ సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుందని మొదటి నుండి చెబుతున్నారు. అయితే పుష్ప 2 ను మొదలు పెట్టడం కోసం ఆరు నెలల గ్యాప్ ఉంది కనుక ఆ గ్యాప్ లో ఈసినిమాను చాలా స్పీడ్ గా ముగించాలని భావిస్తున్నారు. అందుకోసం ఐకాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేస్తున్నారు. ఏ విషయంలో కూడా ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఐకాన్ సినిమా ను అన్ని అనుకున్నట్లుగా జరిగితే నవంబర్ లోనే పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ మరియు ఇతర నటీనటుల విషయంలో కూడా పాన్ ఇండియా అప్పీల్ కనిపించేలా జాగ్రత్తలు పడుతున్నారు.

మొదట ఐకాన్ సినిమా కోసం ఒక టాలీవుడ్ హీరోయిన్ ను అనుకున్నారు. కాని తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మను ఐకాన్ కు జోడీగా నటింపజేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఐకాన్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ హీరోయిన్ గా నటించడం మాత్రమే కాకుండా ఒక స్టార్ నటుడు విలన్ పాత్రను చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఐటెం సాంగ్ ను కూడా ఉత్తరాదిలో మంచి పేరున్న నటితో చేయించబోతున్నట్లుగా చెబుతున్నారు. తమిళం లేదా మలయాళం నుండి ఒక స్టార్ నటుడిని ఐకాన్ లో కీలక పాత్ర కోసం నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి ఐకాన్ కు పాన్ ఇండియా అప్పీల్ కలిగేలా అన్ని భాషలకు చెందిన ప్రేక్షకులు గుర్తించే పలువురు నటీ నటులను నటింపజేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విడుదల చేసేలా ఐకాన్ ను ప్లాన్ చేస్తున్నారు. ఐకాన్ అధికారిక ప్రకటన మరి కొన్ని రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.