Begin typing your search above and press return to search.

హీరో విజయ్ పై ఐటీరైడ్స్.. బీజేపీ టార్గెట్ చేసిందా?

By:  Tupaki Desk   |   6 Feb 2020 5:00 AM GMT
హీరో విజయ్ పై ఐటీరైడ్స్.. బీజేపీ టార్గెట్ చేసిందా?
X
ఐటీ దాడులు.. ఇప్పుడు అవినీతి అధికారుల పై, అక్రమంగా డబ్బులు కూడబెట్టుకున్న వారిపై కంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపైనే ఎక్కువగా జరుగుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆ కోవలోనే తాజాగా తమిళనాట ఐటీ దాడులను ఉదాహరణ గా చూపిస్తున్నాయి.

*కోలీవుడ్ పై ఐటీ నజర్
తమిళనాట ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నటుడు ఇలయ దళపతి విజయ్ పై ఐటీ దాడులు సంచలనంగా మారాయి. బుధవారం విజయ్ నటిస్తున్న సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్లి మరీ విజయ్ ను విచారించిన ఐటీ అధికారులు.. గురువారం చెన్నైలోని విజయ్ ఇళ్ల పై సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి నిర్బంధించి నిర్విరామంగా విచారిస్తున్నారు. చెన్నైలో ఏక కాలంలో 20 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

* ఐటీ దాడులకు కారణమేంటి?
ఇటీవలే అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా ‘బిగిల్’ చిత్రం తెరకెక్కింది. విజయ్ సొంత నిర్మాణ సంస్థ ఏజీఎస్ దీన్ని నిర్మించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఏకంగా దాదాపు 300 కోట్ల వరకూ వసూళ్లు సాధించినట్టు కోలీవుడ్ టాక్. ఈ సినిమా లావా దేవీలకు సంబంధించి పన్ను ఎగ్గొట్టారని విజయ్ ఇళ్లు, ఆఫీసుల పై ఐటీ రైడ్స్ సాగుతున్నాయి.

*విజయ్ ఇంటికి పోటెత్తిన అభిమానులు
తమ అభిమాన హీరో విజయ్ పై ఐటీ దాడులను నిరసిస్తూ ఆయన అభిమానులు చెన్నైలోని విజయ్ ఇంటికి పోటెత్తారు. ఐటీ అధికారులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం తో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

*బీజేపీ టార్గెట్ చేసిందా?
హీరో విజయ్ పై ఐటీ దాడులు రాజకీయ రంగు పులుముకున్నాయన్న ఆరోపణలున్నాయి. హీరో విజయ్ ని బీజేపీ టార్గెట్ చేసిందని అభిమానులు ఆరోపిస్తున్నారు. విజయ్ నటించిన గత 3 సినిమాల్లో బీజేపీ టార్గెట్ గా పొలిటికల్ సెటైర్లు వేశాడు. ఈ కారణంతోనే బీజేపీ హీరో విజయ్ ని టార్గెట్ చేసిందంటున్నారు.

మొత్తంగా కోలీవుడ్ లో ఐటీ రైడ్స్, సినీ వర్గాల్లోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ సంచలనం గా మారాయి.