Begin typing your search above and press return to search.

MAA వార్: సైలెంట్ గా ఉన్న సింహం జూలు ప‌ట్టుకు లాగారు!

By:  Tupaki Desk   |   23 July 2021 2:30 AM GMT
MAA వార్: సైలెంట్ గా ఉన్న సింహం జూలు ప‌ట్టుకు లాగారు!
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల ర‌చ్చ అంతా ఇంతా కాదు. ముఖ్య‌మంత్రి.. ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వికైనా ఇంత‌టి హంగామా లేదేమో! అంటూ చెణుకులు వినిపిస్తున్నా.. ఎవ‌రూ ఎందులోనూ త‌గ్గ‌డం లేదు. ఒక సాధార‌ణ ఎన్నిక‌ల ప్ర‌హ‌సనంలా ఊహించ‌నంత‌ హంగామా.. అణువ‌ణువునా కుతంత్రాలు క‌నిపిస్తున్నాయి. అంతిమంగా ప‌ద‌విని చేప‌ట్ట‌డం లేదా త‌మవారిని అంద‌లం ఎక్కించ‌డం అనే డ్రామాలు తెర‌పై క‌నిపిస్తున్నాయి.

తాజాగా మంచు విష్ణు బ్యాక్ టు బ్యాక్ త‌న మ‌న‌సులో ఉన్న‌ది ఓపెన‌వుతూ వ్యూహానికి ప‌దును పెట్టారు. ఒక ర‌కంగా పాచిక‌ల్ని విసిరారు. ఈసారి అత‌డి పాచిక సైలెంట్ గా ఉన్న సింహాన్ని ప‌ట్టి కెలికిన‌ట్టుగానే ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది. ఒక‌వేళ సినీపెద్ద‌లు ఏక‌గ్రీవం చేయ‌ద‌లిస్తే ఆ న‌టుడికి తాను మ‌ద్ధ‌తునిస్తాన‌ని ప్ర‌క‌టించిన మంచు వార‌బ్బాయి తెలివిగా ఓ మెలిక వేశారు.

``కృష్ణ- కృష్ణంరాజు- చిరంజీవి`` వంటి సినీ ప‌రిశ్ర‌మ పెద్దలందరూ కలిసి ఏకగీవ్రంగా ఎన్నుకుంటే త‌న‌కు అభ్యంత‌రం లేద‌ని కూడా అన్నారు. త‌న‌ను సోద‌రుడిగా భావించే న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌ను అధ్య‌క్షుడిని చేస్తే త‌న‌కేమీ అభ్యంత‌రం లేద‌ని కూడా అనేశారు. బాల‌య్య హ‌యాంలో సీనియ‌ర్లు కొంద‌రు అధ్య‌క్షులు కాలేద‌ని వారు ఎవ‌రు అయినా త‌న‌కు ఓకే అని అన్నారు.

ఒక‌వేళ ఏక‌గ్రీవం చేయ‌క‌పోతే తానే పోటీకి దిగుతాన‌ని కూడా అన్నారు. మొత్తానికి తాన‌యినా అధ్య‌క్షుడు కావాలి.. త‌న‌వార‌యినా కావాలి! అన్న‌చందంగా విష్ణు విసిరిన పాచిక పారుతుందా? అన్న‌ది ఇప్పుడు డిబేట‌బుల్ గా మారింది. మాలో యునిటీ లేదంటూనే అత‌డు టీవీ చానెళ్ల‌లో డిబేట్ పెట్ట‌డంపైనా ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా చ‌ర్చకు తావిచ్చింది. ఇదంతా ఎన్నిక‌ల వ్యూహంలో భాగం మాత్ర‌మే.

ఇక మా బిల్దింగ్ స్థ‌లం విష‌య‌మై నాగ‌బాబు ప్ర‌శ్న‌కు కూడా విష్ణు ఆన్స‌ర్ ఇచ్చారు. నాగ‌బాబు త‌న‌కు తండ్రి స‌మానులు అని ఆయ‌నంటే అభిమాన‌మ‌ని విష్ణు అన్నారు. మా భ‌వంతి నిర్మాణం కోసం త‌న ప్లానేమిటో సరైన సమయం వచ్చినప్పుడు చెబుతానని విష్ణు తెలిపారు. ఇరు రాష్ట్రాల నాయ‌కుల‌తో త‌న‌కు ఉన్న సంబంధాల దృష్ట్యా మా కోసం స్థ‌లం సంపాదించ‌గ‌ల‌న‌ని ధీమాను వ్య‌క్తం చేశారు.

ఓవ‌రాల్ గా ఇంట‌ర్వ్యూల్లో అత‌డు ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గాన్ని తుత్తునియ‌లు చేసే వ్యూహాన్ని అనుస‌రించార‌ని అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది. ఇందులో భాగంగానే సైలెంట్ గా ఉన్న సింహాన్ని కెలికారు! అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అస‌లు ఇలాంటి వాటిలో ఆ ప‌ద‌వులు అంటే అంత‌గా ఆస‌క్తి చూపించ‌ని బాల‌య్యను కూడా `మా` ఎన్నిక‌ల్లో దిగాల‌ని విష్ణు పిలుపునిచ్చారేమిటా! అంటూ వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది.

జైలు కెళ్లాల్సిన వాళ్లెవ‌రో తేల్చ‌ని విష్ణు:

MAA ఎన్నిక‌ల వార్ లో జైలుకెళ్లాల్సిన‌వాళ్లు అంటూ బాంబ్ పేల్చిన విష్ణు ఇంత‌కీ ఎవ‌రు వాళ్లు అన్న‌ది మాత్రం ఇంకా చెప్ప‌లేదు. మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ మంచు విష్ణు ఎపిసోడ్స్ నేప‌థ్యంలో అత‌డు చేసిన ఆ కామెంట్ ఇండ‌స్ట్రీలో షివ‌రింగ్ తెచ్చింది.

ఓ టీవీ చానెల్ ఇంట‌ర్వ్యూలో మూవీ ఆర్టిస్టుల మ‌ధ్య యునిటీ లేద‌ని... అస‌లు ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కు అనేవారే లేర‌ని ఆయ‌న వ్యాఖ్యానించిన తీరు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అలాగే గ‌తంలో జైలు కెళ్లాల్సిన వాళ్ల‌ను కాపాడామ‌ని .. జైలుకెళ్లాల్సిన వాళ్లు శ్రుతిమించి మాట్లాడుతున్నారు! అంటూ ప‌రోక్షంగా మంచు విష్ణు విసిరిన పంచ్ లు చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

ఇండ‌స్ట్రీలో కొంద‌రు ఊచ‌లు లెక్క బెట్ట‌కుండా బ‌య‌ట ఉన్నారంటే ఎవ‌రి వ‌ల్ల అన్న‌ది వాళ్ల‌నే అడ‌గాలి. పోలీస్ స్టేష‌న్ లో తెల్ల‌వారి 4 గం.ల‌కు కూచోబెడితే `అదొక మిస్ అండ‌ర్ స్టాండింగ్` అంటూ బ‌య‌ట‌కి తీసుకొచ్చాం. వారి పేర్ల‌ను మాత్రం చెప్పను అంటూ కామెంట్ చేయడంపై క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీలో చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని తెలిసింది. ఫ్యామిలీలో జ‌రిగే విష‌యాలు నేను బ‌య‌ట పెట్ట‌ను.. పెద్ద‌లు చెప్పిన‌ది వింటాను.

అదే ఆచ‌రిస్తాన‌ని విష్ణు అంటున్నా ఇలా మీడియాకెక్క‌డంపై కాస్త సీరియ‌స్ డిబేట్ మొద‌లైంది. ముఖ్యంగా జైలు కెళ్లాల్సిన వాళ్లు ఎవ‌రెవ‌రు? అన్న‌ది అత‌డు పేర్లు చెప్పాల్సి ఉందింకా. ఇక‌పోతే తెల్లవారు ఝామున 4గంటల‌కు ఎవ‌రిని పోలీస్ స్టేష‌న్ నుంచి విడిపించారు? అన్న‌ది తేలాల్సి ఉంది అంటూ గుస‌గుస‌లు స్ప్రెడ్ అయ్యాయి.