'ఎన్టీఆర్' లో నాకు ఎన్టీఆర్ కనిపించలేదు

Mon Jan 21 2019 22:56:53 GMT+0530 (IST)

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ అంటూ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. వర్మ ఈమద్య కాలంలో చేసిన సినిమాల కోసం ప్రేక్షకులు ఇంతగా ఎదురు చూసింది లేదు. బాలకృష్ణ 'ఎన్టీఆర్' చిత్రం కంటే కూడా అధికంగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నట్లుగా సోషల్ మీడియా టాక్. ఈ సమయంలోనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లోని ఎన్టీఆర్ లుక్ ను వర్మ రివీల్ చేశాడు. నిజంగా ఎన్టీఆర్ దిగి వచ్చాడా అన్నట్లుగా ఆ పాత్రను పోషించిన వ్యక్తి ఉన్నాడంటూ ప్రశంసలు దక్కాయి.ఈ సందర్బంగా వర్మ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ నటించి నిర్మించిన 'ఎన్టీఆర్' చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాను నేను ఇంకా చూడలేదు. అయితే ట్రైలర్ మాత్రం చూశాను. ట్రైలర్ లో ఏ ఒక్క షాట్ లో కూడా నాకు ఎన్టీఆర్ ను చూస్తున్నట్లుగా అనిపించలేదు. ఎన్టీఆర్ కొడుకు అవ్వడం వల్ల బాలకృష్ణ కు కొన్ని పోలికలు వచ్చాయి తప్ప ఎన్టీఆర్ లా మాత్రం బాలయ్య ఉండలేడు. ఎన్టీఆర్ లో నాకు ఎన్టీఆర్ కనిపించలేదు ఆయన కొడుకు కనిపించాడంటూ వర్మ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఇక తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ట్రైలర్ ను ఈనెల చివర్లో లేదా వచ్చే నెల ఆరంభంలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. తన చిత్రంలో ఎన్టీఆర్ గా పోషించిన వ్యక్తిని బాలీవుడ్ నుండో మరెక్కడ నుండో తీసుకు రాలేదని గోదావరి జిల్లాకు చెందిన రంగస్థల నటుడని వర్మ క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఎన్నికల్లో ఓడి పోవడం ఆ తర్వాత వైశ్రాయ్ హోటల్ ఘటన ఆయన మరణం వంటి ఘటనలను చూపించబోతున్నట్లుగా వర్మ పేర్కొన్నాడు. తాను చేస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ లో అన్ని నిజాలు చూపుతానంటూ మరోసారి గట్టిగా నొక్కి చెప్పాడు వర్మ.