మూవీ రివ్యూ : హంట్

Thu Jan 26 2023 12:55:16 GMT+0530 (India Standard Time)

Hunt Movie Review

‘హంట్’ మూవీ రివ్యూ
నటీనటులు: సుధీర్ బాబు-భరత్-శ్రీకాంత్-చిత్ర శుక్లా-అసిఫ్ తాజ్-కబీర్ దుహాన్ సింగ్-మైమ్ గోపి తదితరులు
సంగీతం: జిబ్రాన్
ఛాయాగ్రహణం: అరుల్ విన్సెంట్
నిర్మాత: ఆనంద్ ప్రసాద్
కథ-స్క్రీన్ ప్లే: బాబీ-సంజయ్
దర్శకత్వం: మహేష్ సూరపనేని‘సమ్మోహనం’ తర్వాత సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు సుధీర్ బాబు. కొన్ని నెలల కిందటే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే రొమాంటిక్ మూవీతో పలకరించిన అతను.. ఇప్పుడు ‘హంట్’ అనే థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్ బాబు నిరీక్షణకు ఈ సినిమా తెరదించేలా ఉందేమో చూద్దాం పదండి.

కథ:

అర్జున్ (సుధీర్ బాబు) హైదరాబాద్ సిటీలో అసిస్టెంట్ కమిషనర్. అతడికి డిపార్టుమెంట్లో మోహన్ (శ్రీకాంత్).. ఆర్యన్ (భరత్) మంచి స్నేహితులు. అర్జున్ తో కలిసి చేసిన ఒక టెర్రరిస్ట్ ఆపరేషన్లో హీరోగా పేరు తెచ్చుకుని గ్యాలెంట్రీ అవార్డుకు ఎంపికవుతాడు ఆర్యన్. ఆ అవార్డును అందుకుంటున్న స్టేజ్ మీదే అతణ్ని ఎవరో కాల్చి చంపేస్తారు. ఈ కేసును విచారించిన అర్జున్ హంతకుడెవరో తెలుసుకుని మోహన్ కు ఫోన్ చేసి చెబుతున్న టైంలోనే యాక్సిడెంట్ అయి జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. దీంతో మళ్లీ జీరో నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాల్సి వస్తుంది. మరి ఈ క్రమంలో అర్జున్ కు ఎదురైన సవాళ్లేంటి.. వాటిని అధిగమించి ఆర్యన్ ను చంపిన హంతకుడెవరో అతను కనిపెట్టాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘హంట్’ సినిమా ‘ముంబయి పోలీస్’ అనే పదేళ్ల కిందటి మలయాళ చిత్రానికి రీమేక్. ఈ సినిమా కథ గురించి తెలిస్తే.. దీన్ని తెలుగులో తీయాలన్న ఆలోచన చేసినందుకు ఆశ్చర్యపోతారు. ఇందులో లీడ్ రోల్ చేయడానికి సుధీర్ బాబు ముందుకు వచ్చినందుకు కచ్చితంగా అభినందిస్తారు. కథ వినగానే కొంచెం కంగారు పడి.. ఆ పాత్ర చేయడానికి ఎవ్వరైనా కొంచెం సందేహిస్తారు. కానీ సుధీర్ బాబు ఈ పాత్రను ఒప్పుకోవడం.. ఇలాంటి కథను తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడకుండా సినిమా తీయడం మన దగ్గర వచ్చిన ఒక మంచి మార్పుకి నిదర్శనం. ఐతే ఒక షాకింగ్ ట్విస్టుతో ముడిపడ్డ ఓ కొత్త కథను తెలుగు ప్రేక్షకులకు అందించాలనుకోవడం అభినందనీయమే కానీ.. కేవలం ఆ ట్విస్టు మీదే ఆధారపడకుండా మిగతా కథనాన్ని కూడా ఆసక్తికరంగా తీర్చిదిద్దుకోవడమూ కీలకమే. ఈ విషయంలోనే ‘హంట్’ టీం తడబడింది. ప్లాట్ పాయింట్.. చివర్లో వచ్చే ట్విస్టు బాగున్నా.. మొత్తంగా సినిమా బిగితో సాగకపోవడం ‘హంట్’కు మైనస్.

ఒక మర్డర్ కేసు విచారణను ఇంటెన్స్ గా చూపిస్తూ.. దాని మీదే ఒక పూర్తి సినిమాను నడిపించే థ్రిల్లర్ కథలు తరచుగానే చూస్తున్నాం తెలుగు తెర మీద. ముఖ్యంగా హిట్.. హిట్-2 సినిమాలతో ఈ కథలు మనవాళ్లకు బాగా అలవాటయ్యాయి కూడా. ‘హంట్’ సైతం దాదాపుగా అలాంటి కథే. తన సహోద్యోగి.. స్నేహితుడు అయిన పోలీస్ అధికారి మర్డర్ కేసును ఛేదించే క్రమంలో ఒక ఏసీపీకి ఎదురయ్యే అనుభవాల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఇందులో వైవిధ్యం ఏంటంటే.. హీరోకు హంతకుడెవరో తెలిశాక ఒక యాక్సిడెంట్ జరిగి పాక్షికంగా జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. ముందు తన చుట్టూ ఉన్న వాళ్లు ఎవరో ఏంటో తెలుసుకుంటూ.. ఆ మర్డర్ కేసును అతను ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడతాడు. ఈ కథలో ఆసక్తికర మలుపు ఇదే. కథను కూడా ఈ యాక్సిడెంట్ దగ్గర్నుంచే మొదలుపెట్టడం.. స్క్రీన్ ప్లేలో ఆసక్తికరమైన ఎత్తుగడ. ఇక్కడి నుంచి గతం.. వర్తమానం మధ్య కథను ముందుకు నడిపిస్తూ వెళ్లాడు దర్శకుడు. ఐతే ఆరంభ సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించినా.. ముందుకు సాగేకొద్దీ క్యూరియాసిటీని కొనసాగించడంలో.. ఉత్కంఠ రేకెత్తించడంలో ‘హంట్’ విఫలమైంది. ముగ్గురు పోలీసుల స్నేహాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు పెట్టిన సన్నివేశాలేవీ ఆసక్తికరంగా అనిపించవు. దీనికి తోడు హత్య కేసులో ముగ్గురు అనుమానితులకు సంబంధించిన బ్యాక్ స్టోరీలు కూడా చాలా సాధారణంగా అనిపిస్తాయి. ఈ పాత్రలు కానీ.. వాటితో ముడిపడ్డ సన్నివేశాల్లోనూ విశేషం లేదు.

హంతకుడెవరు అనే విషయంలో ఉత్కంఠ అంతకంతకూ పెరిగేలా చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కొన్ని ఆసక్తికర విషయాలను కూడా తెరపై సరిగా ప్రెజెంట్ చేయలేకపోవడం మైనస్ అయింది. ప్రి క్లైమాక్స్ ముందు ఒక దశలో సినిమా గ్రాఫ్ బాగా పడిపోతుంది. హంతకుడెవరనే విషయంలో సస్పెన్స్ రివీల్ అవడం మొదలయ్యాక కానీ ప్రేక్షకులు మళ్లీ అలెర్ట్ అవరు. చివర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను కచ్చితంగా షాక్ కు గురి చేస్తుంది. కానీ ట్విస్టుతో మొత్తం గ్రాఫ్ పైకి లేవడం అంటే కష్టమే. మనం చూడబోతున్నది ఎలాంటి సినిమానో ప్రోమోలతో సరిగా కన్వే చేయడం కూడా ముఖ్యం. ఈ విషయంలో ‘హంట్’ టీం కొంత గందరగోళ పడ్డ మాట కూడా వాస్తవం. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు.. కొంచెం ఓపిక చేసుకోగలిగితే ‘హంట్’పై ఒక లుక్కేయొచ్చు. మిగతా వాళ్లకు మాత్రం ఈ సినిమాతో కష్టమే.

నటీనటులు:

సుధీర్ బాబు నటనలో సినిమా సినిమాకూ మెరుగవుతున్నాడు అనడానికి ఈ మధ్య వస్తున్న సినిమాలు రుజువు. తన సినిమాలు అటు ఇటుగా ఉంటున్నా.. పెర్ఫామెన్స్ విషయంలో మాత్రం అతను ఆకట్టుకుంటున్నాడు. ‘హంట్’లో టిపికల్ గా అనిపించే పోలీసాఫీసర్ పాత్రలో అతను మెప్పించాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను అతను పోషించిన విధానం.. తనలో మంచి నటుడున్నాడని చాటుతుంది. పతాక సన్నివేశాల్లో సుధీర్ నటన ఆశ్చర్యపరుస్తుంది. నెగెటివ్ షేడ్స్ తో పాటు ఎమోషన్లను బాగా పండించాడు. సినిమాలో ఫోకస్ అంతా అతడి మీదే ఉంది. మిగతా నటీనటులంతా మామూలుగా అనిపిస్తారు. శ్రీకాంత్ ది కీలక పాత్రే అనిపిస్తుంది కానీ.. అతను ప్రత్యేకంగా చేయడానికి ఏమీ లేకపోయింది. ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ చూడ్డానికి బాగున్నాడు కానీ.. తన పాత్ర-నటన కూడా  స్పెషల్ గా ఏమీ అనిపించదు. అసిఫ్ తాజ్ పర్వాలేదు. చిత్ర శుక్లా.. కబీర్ సింగ్.. మైమ్ గోపి.. వీళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:

పాటల్లేని ఈ సినిమాలో జిబ్రాన్ నేేపథ్య సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఆర్ఆర్ ను ప్రేక్షకులు ఫీలయ్యే స్థాయిలో అయితే ఔట్ పుట్ లేదు. సినిమాలో కూడా ఆశించిన స్థాయిలో ఉత్కంఠ లేకపోవడం వల్లో ఏమో ఆర్ఆర్ అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. అరుల్ విన్సెంట్ ఛాయాగ్రహణం బాగుంది. యాక్షన్ సీన్లలో చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా విజువల్స్ బాగున్నాయి. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఓకే. దర్శకుడు మహేష్ సూరపనేని.. మలయాళ ఒరిజినల్ ను యాజిటీజ్ ఫాలో అయినట్లున్నాడు. అందుకే స్క్రీన్ ప్లే క్రెడిట్ కూడా ఒరిజినల్ రైటర్లకు ఇచ్చాడు. కొన్ని సన్నివేశాల వరకు ఓకే అనిపించినా మొత్తంగా దర్శకుడు మెప్పించలేకపోయాడు. కథలో విషయం ఉన్నప్పటికీ.. కథనాన్ని బిగితో నడిపించకపోవడం దర్శకుడి లోపమే.

చివరగా: హంట్.. మంచి పాయింటే కానీ!

రేటింగ్ - 2.25/5