`పుష్ప` కారణంగా మెగా హీరో మూవీకి భారీ క్రేజ్

Mon Jan 17 2022 23:00:01 GMT+0530 (India Standard Time)

Huge craze for mega hero movie

బాలీవుడ్ లో ఇప్పుడు టాలీవుడ్ చిత్రాలకు క్రేజ్ పెరుగుతోంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా మాత్రమే అనే వాదన వినిపించేది. కానీ ట్రెండ్ మారింది. రోజులు మారాయి. ఇప్పడు సినిమా అంటే ప్రతీ ఒక్కరూ టాలీవుడ్ వంక చూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కూడా టాలీవుడ్ సినిమా వైపే అడుగులు వేస్తున్నారు. `బాహుబలి`తో ఈ మార్పు మొదలైంది. రాజమౌళి తెలుగు సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ని తీసుకొచ్చి బంగారు బాటని వేస్తే దాన్ని మన స్టార్ డైరెక్టర్ లు కంటిన్యూ చేస్తున్నారు.



రాజమౌళి `బాహుబలి`తో అందించిన మార్గమే ప్రధాన ఆయుధంగా నిలిచి ఇప్పుడు టాలీవుడ్ చిత్రాలపై దేశ వ్యాప్తంగా క్రేజ్ ని తెచ్చిపెడుతోంది. రాజమౌళి తరువాత టాలీవుడ్ కు క్రేజ్ ని తెచ్చిపెట్టిన దర్శకుడిగా సుకుమార్ రెండవ స్థానంలో నిలిచారు. ఆయన తెరకెక్కించిన `పుష్ప` దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

గత ఏడాది విడుదలైన చిత్రాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన సినిమాగా నిలిచింది. అంతే కాకుండా గత ఏడాది విడుదలైన చిత్రాల్లో 300 కోట్లు వసూళ్లని రాబట్టిన చిత్రంగా రికార్డుని సాధించింది. బన్నీ పాత్రని మలిచిన తీరు మేనరిజమ్స్ బన్నీ పలికిన డైలాగ్స్ ఇప్పడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారి దర్శకుడు సుకుమార్ ని బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మార్చింది.

దీంతో చాలా మంది సుకుమార్ గత చిత్రాలపై కన్నేశారు. ఇందులో భాగంగా గోల్డ్ మైన్స్ అనే సంస్థ `రంగస్తలం` చిత్రాన్ని హిందీలో డబ్ చేయబోతోంది. ప్రస్తుతం బన్నీ నటించిన `అలవైకుంఠపురములో` చిత్రాన్ని హిందీలోకి అనువదించి దేశ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్న ఈ సంస్థ `రంగస్థలం` హిందీ వెర్షన్ ని ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.

`రంగస్థలం` హిందీ వెర్షన్ ని దేశ వ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయాలని గోల్డ్ మైన్స్ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. సుకుమార్ సినిమా కావడం రామ్ చరణ్ నటించిన మూవీ కావడంతో ఈ చిత్రం ఉత్తరాదిలో భారీ వసూళ్లని రాబట్టడం ఖాయం అని భావించి మేకర్స్ ఈ మూవీని హిందీలొకి డబ్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.