నిఖిల్ టైటిల్ కోసం క్యు కడుతున్నారు

Wed Apr 17 2019 11:17:14 GMT+0530 (IST)

Huge Demand for Nikhil Nikhil Yellidiyappa Title

అదేంటి మన నిఖిల్ టైటిల్ కు అంత డిమాండ్ ఏంటి అనుకోకండి. ఇక్కడ మ్యాటర్ వేరు. కర్ణాటక సిఎం కుమరస్వామి వారసుడు నిఖిల్ గౌడ ఆ మధ్య జాగ్వార్ అనే సినిమా ద్వారా మనకూ పరిచయమయ్యాడు గుర్తుందా. అది ఆడలేదు కాబట్టి మన ప్రేక్షకులు మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ కాని ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి అక్కడ బాగానే ఫాలోయింగ్ ఉంది. సరైనోడు టైపు లో మొన్నేదో మసాలా సినిమా ఒకటి చేస్తే కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది.ఇప్పుడితను అక్కడి ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పోటీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా సుమలత గట్టి పోటీనే ఇస్తున్నారు. రెండు వర్గాల మధ్య హోరాహోరి మాటల యుద్ధం నడుస్తోంది సుమలత వైపు కెజిఎఫ్ హీరో యష్ తో పాటు ఇంకొందరు స్టార్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా రెండేళ్ళ క్రితం జరిగిన జాగ్వార్ ఆడియో ఫంక్షన్ లో భాగంగా కుమారస్వామి కొడుకుని ఉద్దేశించి నిఖిల్ ఎల్లిదియప్పా (నిఖిల్ ఎక్కడున్నావ్) అని పిలిచిన వీడియో తాలుకు బిట్ ఒకటి ట్రాల్ పేజెస్ వాళ్ళు వాడుకుని విపరీతంగా వైరల్ చేసేశారు. అది ఎంత దూరం వెళ్లిందంటే నిఖిల్ అనే పేరు వినిపిస్తే చాలు ఎల్లిదియప్పా అంటూ వ్యంగ్య సమాధానాలు వస్తున్నాయి.

దీన్ని క్యాష్ చేసుకుందామని భావించిన నిర్మాతలు ఇదే టైటిల్ ని రిజిస్టర్ చేసుకునేందుకు ఫిలిం చాంబర్ కు వెళ్లారు. ఇలా వచ్చిన వాళ్ళ సంఖ్య 25 దాకా ఉండటం చూసి అక్కడివారు షాక్ తిన్నారు. ఈ టైటిల్ మరీ ఇంత వైరల్ అయ్యిందా అని ఆశ్చర్యపోతు ఎన్నికలు అయ్యాక ఎవరి స్క్రిప్ట్ కి అనుగుణంగా ఉందనిపిస్తే వాళ్ళకు ఇస్తామని చెప్పి పంపించారు. చూసారా ట్రాలింగ్ దెబ్బకు ఏకంగా ఓ టైటిల్ కే ఎంత డిమాండ్ వచ్చిందో