Begin typing your search above and press return to search.

'BBB' కాంబో సెట్ అవుతోంది.. కానీ..?

By:  Tupaki Desk   |   14 Jan 2022 4:34 PM GMT
BBB కాంబో సెట్ అవుతోంది.. కానీ..?
X
టాలీవుడ్ లో ప్రస్తుతం సినీ అభిమానులకు ఊహకందని కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో మల్టీస్టారర్స్ రూపొందుతున్నాయి. ఇద్దరు హీరోలు కలిసి తెర మీద కనిపిస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ప్రత్యర్థులుగా తలపడే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తే రికార్డుల మోత మోగుతోంది. అందుకే మంచి కథ - దర్శకుడు కుదిరితే పెద్ద హీరోలు సైతం ఎలాంటి ఇగోలు లేకుండా కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా RRR వంటి బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా గురించి చర్చలు జరుగుతుండగా.. త్వరలోనే 'BBB' కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయనే ఊహాగానాలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. BBB అంటే బన్నీ - బాలయ్య - బోయపాటి. వీరి ముగ్గురు మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అల్లు అర్జున్ - నందమూరి బాలకృష్ణలతో దర్శకుడు బోయపాటి శ్రీనుది సక్సెస్ ఫుల్ కాంబో.

ఆహా 'అన్ స్టాపబుల్' టాక్ షో తర్వాత అల్లు - నందమూరి ఫ్యామిలీల మధ్య బంధం బలపడింది. ఈ నేపథ్యంలో బోయపాటి దర్శకత్వంలో బన్నీ - బాలయ్య కలయికలో ఓ సినిమా రూపుదిద్దుకొనే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. బోయ‌పాటి ద‌గ్గ‌ర ఓ మ‌ల్టీస్టార‌ర్ కథ ఉంద‌ని.. బాల‌య్య‌ - బ‌న్నీల‌కు ప‌ర్‌ఫెక్ట్ గా స‌రిపోతుంద‌ని.. త్వరలోనే ఈ ఇద్దరు హీరోల క్రేజీ మల్టీస్టారర్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది.

ఇటీవల 'అఖండ' విజయోత్సవ సభలో బోయపాటి మాటలు కూడా దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఓ మీడియా ప్రతినిధి బోయపాటిని ఉద్దేశిస్తూ.. 'మీ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి తెలుసు.. అందులో ఓ హీరో బాలయ్య అని తెలుసు. కానీ ఇంకో హీరో అప్పుడు సెట్ కాలేదు.. బన్నీ - బాలయ్య - బోయపాటి కాంబినేషన్ రావొచ్చా?' అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ''ఇక్క‌డ ఇది జ‌ర‌గ‌దు.. అది జ‌ర‌గ‌దు అని లేదు. ఏదైనా జ‌రగొచ్చు'' అంటూ BBB కాంబినేషన్ పై హింట్ ఇచ్చారు బోయపాటి.

అయితే బన్నీ - బోయపాటి సినిమాలో బాలకృష్ణ చేస్తున్నారా? లేదా బాలయ్యతో ప్లాన్ చేయబోయే 'అఖండ 2' చిత్రంలో బన్నీ నటిస్తున్నాడా? లేక ఇద్దరితో వేరే కథ చేస్తారా? అనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇప్పటికైతే బోయపాటి శ్రీను మాత్రం అల్లు అర్జున్ కి ఓ మాస్ మసాలా స్టోరీ రెడీ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. 'సరైనోడు' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కలయికలో వచ్చే మూవీ ఇది. 'పుష్ప 2' సినిమా పూర్తయిన తరువాత సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.