Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' ట్రైలర్ వచ్చేసింది..!

By:  Tupaki Desk   |   24 Jan 2022 5:11 AM GMT
కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి ట్రైలర్ వచ్చేసింది..!
X
జాతీయ అవార్డు గ్రహీత, మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఉమెన్ సెంట్రిక్ స్పోర్ట్స్ రోమ్-కామ్ ''గుడ్ లక్ సఖి''. విలక్షణ దర్శకుడు నగేష్ కుకునూర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి హీరోగా నటించగా.. జగపతిబాబు ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు కీర్తి సినిమా విడుదలకు సిద్ధమయ్యింది.

''గుడ్ లక్ సఖి'' చిత్రాన్ని జనవరి 28న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజా థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది

ఓ గ్రామీణ యువతి జాతీయ స్థాయి షూటర్ గా ఎలా మారిందనే కథాంశంతో ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. దేశం గర్వపడేలా షూటర్స్ ని తయారు చేయబోతున్నానని జగపతిబాబు అనగా.. మన మధ్యే ఓ గొప్ప షూటర్ ఉందని ఆది చెప్తుండగా.. కీర్తి సురేష్ ని చూపించడంలో ట్రైలర్ ప్రారంభమవుతుంది.

అయితే ఊర్లో అందరూ కీర్తి సురేష్ ని బ్యాడ్ లక్ సఖిగా చూస్తున్నారు. ఎందుకంటే ఆమె ప్రతి ఒక్కరికీ దురదృష్టాన్ని తెస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు. ఆడవారికి షూటింగ్ ఏంటని గ్రామస్థులు వ్యతిరేకించినప్పటికీ.. ఆది ఆమె పేరునే జగపతి బాబుకు సిఫార్సు చేసాడు. ఈ క్రమంలో ఓ దశలో కీర్తి విఫలమై మళ్లీ బ్యాడ్ లక్ సఖి అనిపించుకున్నట్లు తెలుస్తోంది.

అయినప్పటికీ కోచ్ జగపతి బాబు లక్ష్యాన్ని సాధించేలా ఆమెను ప్రేరేపిస్తాడు. ఈ క్రమంలో బ్యాడ్ లక్ సఖి కాస్త గుడ్ లక్ సఖి అని ఎలా అనిపించుకుంది?, దేశానికి పేరు తెచ్చే షూటర్ గా ఎలా ఎదిగింది? అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. స్పూర్తిదాయకమైన కంటెంట్ తో ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. కమర్షియల్ హంగులన్నీ మేళవించి దర్శకుడు నాగేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని రూపొందించారని తెలుస్తోంది.

కీర్తి సురేష్ విలేజ్ అమ్మాయిగా చాలా కూల్ గా.. ఆమె పాత్రను సులభంగా పోషించింది. ఆది - రాహుల్ రామకృష్ణ - జగపతి బాబు తమ ఉనికిని చాటుకున్నారు. చిరంతన్ దాస్ కెమెరా పనితనం ప్రశంసనీయం. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం ఎప్పటిలాగే అత్యుత్తమంగా ఉంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. దిల్ రాజ్ సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై సుధీర్ చంద్ర ఈ సినిమాని నిర్మించారు. శ్రావ్యా వర్మ దీనికి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.