హౌస్ ఆఫ్ మంచూస్ టీజర్: మంచు కుటుంబంలో అసలేం జరిగింది?

Thu Mar 30 2023 21:06:02 GMT+0530 (India Standard Time)

House of Manchu Teaser: Manchu Family Reality Show?

మంచు సోదరుల గొడవ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అన్నదమ్ముల మధ్య చాలా కాలంగా ఘర్షణ నడుస్తోందంటూ ప్రజల్లో చర్చ సాగింది. అన్న మంచు విష్ణు.. తన స్నేహితుడిపై  చెయ్యి చేసుకున్నాడని మనోజ్ ఆరోపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా మీడియాలో ఇది సంచలనంగా మారింది.అయితే టీవీ చానెళ్లలో ముక్కలు ముక్కలుగా మంచు ఇంటి రభసను వీక్షించిన ప్రజలు అసలు ఆ ఇంట్లో ఓవరాల్ గా ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు గూగుల్ ని ఆశ్రయిస్తున్నారు. మంచు ఇంట్లో అసలు ఏం జరిగిందనేది మీడియాతో పాటు ప్రజలందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. మంచు సోదరుల ఘర్షణలో నిజానిజాలేమిటి? అన్నదానిపై అందరిలో అనేక సందేహాలున్నాయి.

అయితే ఈ ఎపిసోడ్ ని ఇప్పుడు బిజినెస్ మేన్ కం నిర్మాత మంచు విష్ణు ఎన్ క్యాష్ చేసుకునేందుకు ఒక రియాలిటీ షోని ప్లాన్ చేయడం చర్చనీయాంశమైంది. 'హౌస్ ఆఫ్ మంచూస్' పేరుతో  అతడు భారతదేశంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోను చేసే ఆలోచనతో ముందుకు వచ్చారు.

దీనిపై ఒక ప్రోమో కూడా తాజాగా విడుదలైంది. మంచు బ్రదర్స్ ఘర్సణ గురించిన వార్తా ఛానెళ్ల క్లిప్పింగ్ లు కాన్ సీక్వెన్స్ లతో ఇది ఆసక్తిని కలిగించింది. టీజర్ లో విష్ణు మంచు తనని తాను పరిచయం చేసుకోవడం.. అనంతరం తమ ఇంట ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేయడం.. ఇవన్నీ ఉత్సుకతను పెంచుతున్నాయి.

నిజానికి ఇలాంటి రియాలిటీ షోలు హాలీవుడ్ లో కొత్తేమీ కాదు. కర్దాషియన్ల (సిస్టర్స్) వ్యక్తిగత జీవితాన్ని తెరపరిచేస్తూ రూపొందించిన అమెరికన్ రియాలిటీ టీవీ సిరీస్ అయిన 'ది కర్దాషియన్స్' మాదిరిగా ఇటీవలే బాలీవుడ్ లో శర్మా సిస్టర్స్ (చిరుత ఫేం నేహా శర్మ- ఐషా శర్మ) షో పాపులరైంది. ఇప్పుడు మంచు బ్రదర్స్ షోని ప్రజలు వీక్షించబోతున్నారు.

మంచు ఫ్యామిలీ లో ఘర్షణలతో పాటు వారి వ్యక్తిగత జీవితాల చుట్టూ కథను తెరపై చూపించే ప్రయత్నమిది. ఏవీఏ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై విష్ణు స్వయంగా ఈ రియాల్టీ షోను నిర్మించనున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి ఇంటి గుట్టును బయట పెడుతూ టీఆర్పీలతో సంపాదించుకోవడమెలానో అమెరికన్లు పాఠం నేర్పించగా ఇప్పుడు ఇండియన్లు దానిని అనుసరిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.