హిట్టు కాంబోలు.. అదిరిపోయే ఎంట్రీ!

Fri Mar 17 2023 14:03:40 GMT+0530 (India Standard Time)

Hit Combos ReEntry Movies

హిట్టు కాంబో మరోసారి తెరమీదకు వస్తుందంటే చాలు.. ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా తెగ ఎగ్జైట్ అవుతుంటారు. ఎప్పుడెప్పుడు వారి సినిమా వస్తుందా అని తెగ వేచి చూస్తుంటారు. కచ్చితంగా ఆ సినిమా కూడా హిట్టవుతుందని భావిస్తుంటారు. అందుకే బాక్సాఫీసు లెక్కల్ని మార్కెట్ లెక్కల్ని అమాంతం పెంచేస్తాయి. దీనికి హీరోయిన్ డైరెక్టర్ కాంబినేషన్ కూడా అతీతమేం కాదు. వరుస హిట్లు కొట్టిన హీరోహీరోయిన్లకు ఉన్న ఆదరణే.. డైరెక్టర్ హీరోయిన్ కలయికలో రూపొందే చిత్రాలకు ఉంటుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో పూజా హెగ్డే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అరవింద సమేత సినిమాతో మొదలైన వీరి హిట్టు కాంబో ఆ తర్వాత అల వైకుంఠపురంతో కొనసాగింది. మూడోసారి ముచ్చటగా.. మహేష్ బాబు సినిమాతో పునరావృతం కాబోతుంది. అయితే ఇది మహేష్ త్రివిక్రమ్ లకు కూడా మూడో సినిమానే. గతంలో అతడు ఖలేజా వచ్చాయి. మరోసారి హిట్టు కొట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మజిలీ సినిమాతో సామ్ కు మాంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ.. మరోసారి ఖుషి సినిమాతో సామ్ తో కలిసి పని చేస్తున్నాడు. మహానటి తర్వాత సామ్ విజయ్ దేవరకొండ కలిసి నటించబోతున్న రెండో సినిమా ఇది.

ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ అజయ్ భూపతి పాయల్ రాజ్ పుత్ కార్తికేయ మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పాయల్ పలు సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు. అజయ్ భూపతి మహాసముద్రం సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అజయ్ పాయల్ కాంబోలో 'మంగళవారం' సినిమా రానుంది. వినూత్నమైన కథాంశంతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.

నాగ్ అశ్విన్ తొలి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం. ఇందులో మాళవిక నాయర్ కీలక పాత్రలో కనిపించింది. తర్వాత మహానటిలోనూ మాళికవ నటించింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ప్రాజెక్టు కె లో పని చేస్తున్నారు.

హిట్ సిరీస్ తెరకెక్కించిన శైలేష్ కొలను.. ప్రస్తుతం వెంకటేష్ తో సైంధవ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హిట్ సినిమాలో నటించిన రుహానీ శర్మను సైంధవ్ లోనూ తీసుకున్నట్లు సమాచారం.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.