బాలయ్య పనైపోయింది అనుకున్నారు కానీ!

Thu Jun 10 2021 21:00:01 GMT+0530 (IST)

Hit After First Three Flops

నటవారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ కెరీర్ కేక్ వాక్ ఏమీ కాదు. ఆయనకు ఆటుపోట్లు సూటిపోటి మాటలు ఉన్నాయి. దాదాపు దశాబ్ధం పాటు తండ్రి ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో నటించి తండ్రి చాటు బిడ్డగానే ఎదిగారు నూనూగు మీసాల బాలకృష్ణ. అయితే 1984లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లాక కానీ ఆయన సోలో హీరో కాలేదు. హీరో అయ్యాడు కదా అని వెంటనే హిట్టు కూడా కొట్టేయలేదు.వరుసగా మూడు సినిమాలు ఫ్లాపులయ్యాయి. దీంతో వైరి వర్గాలు బాలయ్య పనైపోయిందని తండ్రి అండ లేనిదే పని చేయలేడని కూడా ప్రచారం సాగించారు. 1984లో సోలో హీరో అయ్యారు. సాహసమే జీవితం- డిస్కోకింగ్- జననీ జన్మభూమి చిత్రాలు వరుసగా ఫ్లాపులయ్యాయి. ఆ తర్వాత మంగమ్మగారి మనవడు చిత్రంతో బంపర్ హిట్ కొట్టారు. బాక్సాఫీస్ రికార్డుల్ని బ్రేక్ చేసింది ఈ చిత్రం. ఆ సినిమా తర్వాత ఇక వెనుదిరిగి చూసిందే లేదు.

తాతమ్మకల- అన్నదమ్ముల అనుబంధం- వేములవాడ భీమకవి- దానవీరశూరకర్ణ- శ్రీమద్విరాటపర్వము- శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం- రౌడీరాముడు-కొంటె కృష్ణుడు- అనురాగదేవత- సింహం నవ్వింది- శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర..ఇవన్నీ తండ్రి ఎన్టీఆర్ తో కలిసి బాలయ్య చేసిన సినిమాలు.

ముద్దుల క్రిష్ణయ్య- సీతారామకళ్యాణం- అనసూయమ్మగారి అల్లుడు- దేశోద్ధారకుడు- కలియుగ కృష్ణుడు- అపూర్వ సహోదరులు ఇవన్నీ బాలయ్య సోలో కెరీర్ ఆరంభం బంపర్ హిట్లుగా నిలిచాయి. ఇక కెరీర్ లో ఎంతో కీలకమలుపుకు దారి తీసిన సమర సింహారెడ్డి- నరసింహానాయుడు.. ఆ తరవాత చరిత్ర అంతా తెలిసినదే. ఇప్పటికి 105 సినిమాల్లో నటించేసిన బాలకృష్ణ తదుపరి బోయపాటితో అఖండ చిత్రానికి పని చేస్తున్నారు. తదుపరి గోపిచంద్ మలినేని.. అనీల్ రావిపూడి వంటి నవతరం దర్శకులతో పని చేయనున్నారు.