Begin typing your search above and press return to search.

100 కోట్ల దిశగా హిందీ 'పుష్ప-1'.. 6వ వారంలో 'బాహుబలి 2' రికార్డ్ బ్రేక్..!

By:  Tupaki Desk   |   28 Jan 2022 9:30 AM GMT
100 కోట్ల దిశగా హిందీ పుష్ప-1.. 6వ వారంలో బాహుబలి 2 రికార్డ్ బ్రేక్..!
X
అల్లు అర్జున్ - రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన సినిమా ''పుష్ప ది రైజ్''. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్ లో అంచనాలకు మించి వసూళ్ళు రాబట్టి ట్రేడ్ వర్గాలను అవాక్కయ్యేలా చేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ అయిన తర్వాత కూడా హిందీలో 100 కోట్ల దిశగా పరుగులు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

వాస్తవానికి 'పుష్ప' పార్ట్-1 మూవీకి నార్త్ లో సరైన ప్రమోషన్లు చేయకపోవడం వల్ల మరియు పేలవమైన డిస్ట్రిబ్యూషన్ కారణంగా హిందీ బెల్ట్ లో మొదటి రోజు దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసింది. అయితే ఉత్తరాది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా మూడు వారాల తర్వాత కూడా మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టడం విశేషం.

'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' మరియు '83' వంటి రెండు క్రేజీ చిత్రాలను ఎదుర్కొని 'పుష్ప: ది రైజ్' మూవీ ఈ రేంజ్ వసూళ్ళు అందుకోవడం గొప్ప విషయమనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్దే కాదు, పుష్పరాజ్ సోషల్ మీడియాలో కూడా సంచలనంగా మారాడు. పుష్ప సిగ్నేచర్ స్టెప్ మరియు పాటలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ క్రమంలో ఇప్పుడు నార్త్ మార్కెట్ లో ఆరో వారంలోనూ 'పుష్ప-1' అదరగొట్టింది.

'పుష్ప:ది రైజ్' సినిమా 6వ వారంలో 6 కోట్లు రాబట్టి 'ఊరి: ది సర్జికల్ స్ట్రైక్' 'గదర్: ఏక్ ప్రేమ్ కథ' తర్వాత ఆల్ టైమ్ మూడవ అత్యధిక ఆరవ వారం నెట్ గ్రాసర్ గా చరిత్ర సృష్టించింది. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' ఆరవ వారం వసూళ్ళలో ప్రభాస్ నటించిన 'బాహుబలి: ది కన్క్లూజన్' (5.40 కోట్లు) ని క్రాస్ చేసి మూడవ స్థానాన్ని సంపాదించుకుంది.

రాత్రిపూట కర్ఫ్యూలు - ఆక్యుపెన్సీ పరిమితులు మరియు అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ ఉన్నప్పటికీ 'పుష్ప' వసూళ్లకు బ్రేక్ పడలేదు. హిందీ వర్షన్ డిజిటల్ రిలీజ్ కూడా బాక్సాఫీస్ కలెక్షన్స్ పై ప్రభావం చూపలేదని అర్థం అవుతోంది. రాబోయే రెండు వారాల్లో ఎటువంటి పోటీ లేకుండా ఉంటే 100 కోట్ల క్లబ్ లో చేరడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద అనేక ఇతర రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది.

కాగా, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రెండు భాగాలుగా 'పుష్ప' సినిమాను ప్లాన్ చేశారు. కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్.. స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది 'పుష్ప: ది రైజ్' చిత్రంలో చూపించారు. సెకండ్ పార్ట్ లో శత్రువులను ఎదుర్కొని నేర సామ్రాజ్యాన్ని ఎలా పాలించడానేది ఆసక్తికరం.

పార్ట్-1 సక్సెస్ అవడంతో షూటింగ్ ప్రారంభం కాకముందే ''పుష్ప: ది రూల్'' పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ ఎర్నేని - వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు