మూవీ రివ్యూ: 'హీరో'

Sat Jan 15 2022 23:44:41 GMT+0530 (India Standard Time)

Hero Movie Review And Rating

చిత్రం : 'హీరో'నటీనటులు: అశోక్ గల్లా-నిధి అగర్వాల్-జగపతిబాబు-నరేష్-రవిశంకర్-మీమ్ గోపి-వెన్నెల కిషోర్-బ్రహ్మాజీ-సత్య-కోట శ్రీనివాసరావు-అజయ్-కౌసల్య తదితరులు
సంగీతం: జిబ్రాన్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి-రిచర్డ్ ప్రసాద్
మాటలు: కళ్యాణ్ శంకర్-ఏఆర్ ఠాగూర్
నిర్మాత: పద్మావతి గల్లా
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య

ఈ సంక్రాంతికి చివరగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా.. హీరో. సూపర్ స్టార్ కృష్ణ మనవడైన గల్లా అశోక్ హీరోగాపరిచయమైన చిత్రమిది. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందించిన ఈ సినిమా ప్రోమోలతో బాగానే ఆసక్తి రేకెత్తించింది. మరి సినిమాగా 'హీరో' ఎమేర ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ:

అర్జున్ (అశోక్ గల్లా) సినిమా హీరో కావాలని కలలు కనే కుర్రాడు. తండ్రికి నచ్చకపోయినా.. తల్లి అలాగే తన స్నేహితుల ప్రోత్సాహంతో సినిమా ప్రయత్నాల్లో ఉంటాడు. తన అపార్ట్మెంట్లోనే ఉండే సుబ్బు (నిధి అగర్వాల్)తో అతను ప్రేమలో పడతాడు. ఇలా అతడి జీవితం సాగిపోతున్న సమయంలో వేరెవరికో వెళ్లాల్సిన ఒక కొరియర్ అర్జున్ చేతికి వస్తుంది. ఆ కొరియర్ తీసి చూస్తే అందులో ఒక తుపాకీ ఉంటుంది. ఆ తుపాకీ వల్ల అర్జున్ కు రకరకాల సమస్యలు తలెత్తుతాయి. చివరికి ఆ గన్నుని వదిలించుకునే ప్రయత్నంలో ఉండగా.. దాన్ని పంపింది ముంబయికి చెందిన మాఫియా డాన్ సలీమ్ భాయ్ (రవిశంకర్) అని.. తన ప్రేయసి తండ్రిని చంపడానికే ఆ గన్ అని అర్జున్ కు తెలుస్తుంది. ఈ స్థితిలో అర్జున్ ఏం చేశాడు.. తనకు కాబోయే మావయ్యను ఎలా కాపాడుకున్నాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

అన్ని సినిమాల్లో లాజిక్స్ విషయంలో మరీ పట్టుదలగా ఉండకూడదు. కామెడీ సినిమాల్లో అయితే ఇంకొంచెం లిబరల్ గానే ఉండాలి. కానీ కామెడీ పేరు చెప్పి లాజిక్ ను కొండెక్కించేసి కథనే సిల్లీగా మార్చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి 'హీరో' సినిమా ఉదాహరణ. ఈ సినిమాలో కథాకథనాలు ఎంత సిల్లీగా ఉంటాయో చెప్పడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఈ సినిమాలో కథంతా ఒక గన్ను చుట్టూ తిరుగుతుంది. విలన్ ఓ వ్యక్తిని చంపడానికి ఒక గన్ను కొరియర్లో పంపిస్తాడు. ఇక్కడ ఆ మర్డర్ చేయాల్సిన వ్యక్తి పేరు అర్జున్ కాగా.. హీరో పేరు కూడా అర్జున్ కావడంతో కొరియర్ మారి ఇటొచ్చేస్తుందట. ఐతే అడ్రస్ లో ఇంటి నంబరు తప్పుగా పడో.. కొరియర్ బాయ్ అడ్రస్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యో కొరియర్ మార్చి ఇస్తే అర్థం ఉంది కానీ.. రౌడీ పేరే హీరోకు కూడా ఉందని హీరోకు తెచ్చి కొరియర్ ఇచ్చేయడం ఏంటో అర్థం కాదు. ఇక మర్డర్ చేయాల్సిన రౌడీ దగ్గర బోలెడన్ని గన్నులుండగా.. ఈ గన్నుతోనే చంపాలని దాని కోసం ఒక గ్యాంగునేసుకుని తిరుగుతుంటాడు. ఈ లాజిక్కులేంటో ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటుంటే.. ఆ గన్నుతో అపార్ట్మెంట్ మేడ మీద ఉన్న హీరో తనకు తెలియకుండా ఇంకెక్కడో రోడ్డు మీద అమ్మాయిని ఏడిపిస్తున్న సీఐని కాల్చేస్తాడు చిత్రంగా. ఇదెక్కడి విడ్డూరం అనుకుంటుంటే.. ఈ గన్నును వదిలించుకోవడానికి పాపం హీరో పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. అంత పెద్ద హైదరాబాద్ సిటీలో ఈ గన్ను పడేయడానికి హీరోకు చోటే దొరకదు. గన్ను పడేయడానికి పెద్ద ప్లాన్ వేసి.. హుస్సేన్ సాగర్ వరకు వెళ్తాడు. గన్ను అలా విసిరి కొట్టడానికి పట్టే సమయం క్షణ కాలం అయితే.. ఆ పని చేయడానికి కూడా ఇబ్బందై వెనక్కి వచ్చేస్తాడు. గన్ను చుట్టూ తిరిగే ఇలాంటి సిల్లీ సన్నివేశాలతో దాదాపు ముప్పావు గంట సినిమా నడుస్తుందంటే.. 'హీరో' ఎలాంటి చిత్రమో అంచనా వేయొచ్చు.

ఫలితాల సంగతెలా ఉన్నప్పటికీ భలే మంచి రోజు.. శమంతకమణి.. దేవదాస్ చిత్రాలతో తన ప్రతిభను చాటుకున్న శ్రీరామ్ ఆదిత్య.. ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్న కుర్రాడి కోసం 'హీరో' లాంటి సిల్లీ కథ రాయడం.. ఆద్యంతం అదే సిల్లీ తనంతో సినిమాను నడిపించడం ఆశ్చర్యం. అశోక్ గల్లాను ఇలాంటి కథతో లాంచ్ చేయడానికి అతడి కుటుంబం ఎలా ఒప్పుకుందో అర్థం కాదు. అక్కడక్కడా కొంచెం కామెడీ వర్కవుట్ అయినప్పటికీ.. ఆరంభం నుంచి చివరి దాకా సన్నివేశాల్లో హద్దులు దాటిపోయిన అతిని భరించడం మాత్రం చాలా కష్టం. అసలు సినిమా హీరో కావాలనుకున్న హీరో.. ఆరంభంలో ఆడిషన్స్ కోసం దర్శకుల దగ్గరికి చేసే అతి చూస్తేనే ఈ సినిమా 'ఓవర్ ద టాప్' స్టయిల్లో సాగుతుందని అర్థమైపోతుంది. కానీ ఎంతగా ప్రిపేరైనప్పటికీ.. ముందుకు సాగే కొద్దీ భరించలేని స్థాయికి చేరే ఈ 'అతి'తో ప్రేక్షకులకు కష్టమే అవుతుంది. ముఖ్యంగా ఈ తుపాకీ వ్యవహారం తెరపైకి వచ్చాక 'హీరో' పూర్తిగా ట్రాక్ తప్పేస్తుంది. ఒక్క సన్నివేశంలో లాజిక్ ఉండదు. తెరపై జరిగే వ్యవహారం ఏమాత్రం కన్విన్సింగ్ గా అనిపించకపోవడంతో సగం సినిమా అయ్యేసరికే చుక్కలు కనిపిస్తాయి.

విలన్ పాత్ర రంగప్రవేశంతో అయినా పరిస్థితి మారుతుందేమో అని ఆశిస్తే.. అది కూడా అడియాసే అవుతుంది. జగపతిబాబు-విలన్ రవిశంకర్ లకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయ్యేసరికి కళ్లు బైర్లు కమ్ముతాయి. ఈ కథంతా విన్నాక నరేష్ చొక్కా చింపేసుకుంటూ అర్జెంటుగా సిగరెట్ ఇవ్వండి అంటాడు. మీకు అలవాటు లేదు కదా అంటే.. ఇంత దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ విన్నాక సిగరెట్ తాగకుండా బతకడం కష్టం అని బదులిస్తాడు నరేష్. బహుశా దర్శకుడు తాను చూపించిన ఫ్లాష్ బ్యాక్ చూసి ప్రేక్షకుల ఫీలింగ్ ను ముందే ఊహించి ఈ డైలాగ్ పెట్టాడో ఏమో తెలియదు మరి. సినిమా మొత్తంలో కాస్త ఎంగేజ్ చేసే ఎపిసోడ్ ఏదైనా ఉందంటే.. సినిమా షూటింగ్ లో భాగంగా హీరో పాత్రధారి బ్రహ్మాజీ చేసే హంగామానే. అతను తనదైన శైలిలో చెలరేగిపోయాడు ఈ సన్నివేశంలో. 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' తరహాలో బ్రహ్మాజీ తక్కువ నిడివిలోనే మంచి ఇంపాక్ట్ వేశాడు. కానీ ఆ తర్వాత వచ్చే పతాక సన్నివేశంలో మళ్లీ దర్శకుడు పాత స్టయిల్లోకి వెళ్లిపోయాడు. అసంద్భంగా విలన్.. సినిమా వాళ్లను కించపరిచేలా మాట్లాడ్డం.. హీరో-జగపతి కలిసి సినిమా వాళ్లకు ఎలివేషన్లు ఇవ్వడం.. ఇదంతా కృత్రిమంగా అనిపిస్తుంది. అంతిమంగా 'హీరో' ఉద్దేశమేంటో అర్థం కాని అయోమయంలో ప్రేక్షకులు బయటపడతారు.

నటీనటులు:

గల్లా అశోక్ తొలి సినిమా అయినా కంగారేం కనిపించనివ్వలేదు. పాత్రకు తగ్గట్లుగా ఆద్యంతం హుషారుగానే నటించాడు. లుక్స్ పరంగా అతను అంతగా ఆకట్టుకోలేదు. డ్యాన్సులు ఫైట్లు బాగానే చేశాడు. నటనలో ఈజ్ ఉంది. నిధి అగర్వాల్ మరోసారి ఉత్సవ విగ్రహం అయింది. తన పాత్రలోనూ విషయం లేదు. నిధి కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. గ్లామర్ తో మాత్రం ఆమె ఆకట్టుకుంది. జగపతిబాబు నిరాశపరిచాడు. ఆయన మరీ నటన రొటీన్ అయిపోతోంది. నరేష్ ఉన్నంతలో బాగా చేశాడు. విలన్ రవిశంకర్ అతిని భరించడం చాలా కష్టం. మీమ్ గోపిది సిల్లీ క్యారెక్టర్. వెన్నెల కిషోర్.. సత్య కాస్త నవ్వించారు. ఐతే తక్కువ నిడివిలోనే బ్రహ్మాజీ వాళ్లను మించి ఎంటర్టైన్ చేశాడు. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

జిబ్రాన్ సంగీతం ఆకట్టుకోదు. పాటలేవీ గుర్తుంచుకునేలా లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే చెవుల తుప్పు వదలగొట్టేస్తుంది. మరీ లౌడ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో అతను చాలా చోట్ల చికాకు పెట్టాడు. సమీర్ రెడ్డి.. రిచర్డ్ ప్రసాద్ ల విజువల్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఏమీ తగ్గలేదు. బాగానే ఖర్చు పెట్టారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య వీకెస్ట్ వర్క్ 'హీరో'నే అనడంలో మరో మాట లేదు. తొలి మూడు సినిమాల్లో కొత్తగా ప్రయత్నించిన అతను.. ఇలాంటి కథ రాసి.. ఇంత సిల్లీగా సినిమాను నడిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రచయితగా.. దర్శకుడిగా అతను పూర్తిగా నిరాశ పరిచాడు.

చివరగా: హీరో.. భరించలేని సిల్లీతనం

రేటింగ్-2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre