Begin typing your search above and press return to search.

'హీరో'కి స్టార్ డైరెక్టర్ల బూస్టప్ మామూలుగా లేదే!

By:  Tupaki Desk   |   14 Jan 2022 4:30 AM GMT
హీరోకి స్టార్ డైరెక్టర్ల బూస్టప్ మామూలుగా లేదే!
X
ఒకప్పుడు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడం చాలా కష్టం .. నిలదొక్కుకోవడం తేలిక. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం తేలిక .. నిలదొక్కుకోవడమే కష్టం. అయినా సినిమాల పట్ల ఫ్యాషన్ ఉన్న చాలామంది కుర్రాళ్లు ఇండస్ట్రీకి వస్తున్నారు. తమకి ఉన్న అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకుంటూ తెరపై హీరోగా కనిపిస్తున్నారు. ఎవరి ప్రత్యేకతను వారు ఆవిష్కరిస్తూ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కంటెంట్ ఉన్నవారు మాత్రమే ఇక్కడ నిలబడతారు. లేదంటే తిరుగు ముఖం పడతారు. విశేషం ఏమిటంటే ఈ విషయం తెలిసే తమ వైపు నుంచి ఎలాంటి లోపం లేకుండా అంతా కష్టపడుతున్నారు.

ఇక ఇండస్ట్రీకి సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి హీరోలు రావడమనేది మొదటి నుంచి ఉన్నదే. టాలీవుడ్ లో అలా వచ్చిన హీరోలు చాలామందే ఉన్నారు. అలా ఈ ఏడాది సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి అశోక్ గల్లా 'హీరో'గా తెరపైకి వస్తున్నాడు. సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని చెలరేగిపోవడానికి రెడీ అయ్యాడు. ఆయన 'హీరో' సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ వేడుకకు రానాతో పాటు కొరటాల శివ .. అనిల్ రావిపూడి వంటి స్టార్ డైరెక్టర్లు రావడం విశేషం.

సాధారణంగా కొత్తగా ఒక కుర్రాడు హీరోగా ఇండస్ట్రీకి వస్తున్నాడంటే అందుకు తగిన బూస్టప్ అవసరమే. తనపై తనకి నమ్మకాన్ని .. ఆత్మవిశ్వాసాన్ని కలిగించవలసిన అవసరం ఉంటుంది. అలా వెన్ను తట్టి ధైర్యంగా ముందుకు వెళ్లమని చెప్పేవారు అందరికీ దొరకరు. కానీ అశోక్ గల్లాకి ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది. ఆయన గురించి నిన్న ఫంక్షన్ లో కొరటాల మాట్లాడుతూ, తన దగ్గర 'శ్రీమంతుడు' సినిమాకి అశోక్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడనీ, పని చెప్పకముందే అర్థం చేసుకుని దానిని పూర్తి చేసేవాడని అన్నాడు. ఆయన హార్డ్ వర్క్ చేయడానికి వెనుకాడడనే విషయం అప్పుడే నాకు అర్థమైందని చెప్పాడు. హీరోగా ఆయనకి మంచి భవిష్యత్తు ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఇక అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను ఒక చిన్న పాత్రలో కనిపిస్తాను. ఆ పాత్రకి డబ్బింగ్ చెప్పడానికి వెళ్లినప్పుడు అశోక్ సీన్స్ చూశాను. అమరరాజా బ్యాట్రీస్ లా ఫుల్ ఛార్జ్ అయ్యాడని అనిపించింది. ఫస్టు ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకూ ఆయన అదే ఎనర్జీతో తెరపై కనిపిస్తాడని విన్నాను. ఆయనలో కసి .. పట్టుదల ఏ స్థాయిలో ఉన్నాయనే విషయం ఈ సినిమా చూస్తేనే అర్థమవుతోంది. తప్పకుండా ఆయన స్టార్ అవుతాడనే నమ్మకం ఉంది. ఇది ఈ పండుగకి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ " అంటూ చెప్పుకొచ్చాడు. స్టార్ డైరెక్టర్ల నుంచి ఈ రేంజ్ బూస్టప్ ను అందుకున్న 'హీరో' సంక్రాంతికి ఏ రేంజ్ లో సందడి చేస్తాడనేది చూడాలి.