లేటెస్ట్ బజ్: 'మానాడు' రీమేక్ లో హీరో ఎవరంటే..?

Mon Jan 17 2022 10:47:32 GMT+0530 (India Standard Time)

Hero Confirmed For Manaadu Telugu Remake

సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు హీరో రానా తమ్ముడు అభిరామ్ కూడా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో అభిరామ్ తన తొలి సినిమా చేస్తున్నాడు. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాకముందే దగ్గుబాటి వారసుడి రెండో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయని.. అది కూడా బ్లాక్ బస్టర్ రీమేక్ స్క్రిప్ట్ అని టాక్ వినిపిస్తోంది.2021లో ఘన విజయం సాధించిన చిత్రాల్లో ''మానాడు'' ఒకటి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. టైం లూప్ కాన్సెప్ట్ తో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ సక్సెస్ అయింది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ ఈ సినిమా అనూహ్య స్పందన తెచ్చుకుంది. దీంతో ఈ మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ తో పాటు.. అన్ని భాషల రీమేక్ హక్కులను నిర్మాత సురేష్ బాబు కొనుగోలు చేశారు.

ఇటీవలే సురేష్ ప్రొడక్షన్స్ వారు 'మానాడు' సినిమా రైట్స్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి తెలుగు రీమేక్ లో హీరోగా ఎవరు నటిస్తారు? ఎవరు డైరెక్ట్ చేస్తారు? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ఈ రీమేక్ కు సన్నాహాలు జరుగుతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇదే క్రమంలో రానా దగ్గుబాటి పేరు కూడా తెర మీదకు వచ్చింది.

అయితే ఇప్పుడు 'మానాడు' తెలుగు రీమేక్ అభిరామ్ దగ్గుబాటి హీరోగా నటిస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సురేష్ బాబు సరైన దర్శకుడిని ఎంపిక చేయడం కోసం కసరత్తులు మొదలు పెట్టారట. డైరెక్టర్ మరియు ఇతర నటీనటులు సిబ్బందిని ఖరారు చేసిన తర్వాత దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.