'దోస్తీ' సాంగ్ పై అంచనాలు పెంచేసిన హేమచంద్ర..!

Thu Jul 29 2021 18:38:23 GMT+0530 (IST)

Hemachandra On The Awaited Dosti Song

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన జక్కన్న అండ్ టీమ్.. కీరవాణి స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఆగస్టు 1న ఉదయం 11 గంటలకు ''దోస్తీ'' అనే పాటను విడుదల చేస్తున్నారు.'దోస్తీ' పాటను తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ - అమిత్ త్రివేది - విజయ్ ఏసుదాసు - యాజిన్ నజీర్ వంటి ఐదుగురు ప్రముఖ సింగర్స్ ఈ సాంగ్ ను పాడారు. తెలుగు వెర్సన్ పాటను హేమచంద్ర ఆలపించగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. మరో మూడు రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సాంగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సింగర్ హేమచంద్ర 'దోస్తీ' పాట గురించి మాట్లాడుతూ తన డ్రీమ్ నిజమైందని అన్నారు.

"రాజమౌళి - కీరవాణి కాంబినేషన్ లో సాంగ్ కోసం వర్క్ చేయడం నాకు ఫస్ట్ టైమ్. నా కల నిజమైంది. సాంగ్ షూట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది'' అని హేమచంద్ర తెలిపారు. ''ప్రతీ సాంగ్ కు సరిగ్గా పాడగలమా లేదా అనే ప్రెజర్ ఉంటుంది.. అందులోను ఇది రాజమౌళి గారి బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్.. దానిలోని ఫ్రెండ్ షిప్ సాంగ్ ని నేను సరిగా డెలివర్ చేయగలుగుతానా లేదా అని ప్రెజర్ ఫీల్ అయ్యాను. ఇక ప్రమోషనల్ సాంగ్ షూట్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్'' అని గాయకుడు అన్నారు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ సాంగ్ కు బ్యూటిఫుల్ లిరిక్స్ అందించారని.. ప్రతీ లైన్ అద్భుతంగా ఉంటుందని హేమచంద్ర తెలిపారు. 'దోస్తీ' సాంగ్ ఓవరాల్ ప్యాకేజ్ అని చెప్పిన హేమ చంద్ర ఈ సాంగ్ పై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లారు. వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేసే జక్కన్న సాంగ్స్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతీ సాంగ్ పిక్చరైజేషన్ కూడా ఆడియన్స్ వావ్ అనుకునే విధంగా తీర్చిదిద్దడానికి ట్రై చేస్తుంటారు.

ఈ క్రమంలో 'ఆర్ ఆర్ ఆర్' మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా వస్తున్న ''దోస్తీ'' సాంగ్ ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఈ పాట పాడిన హేమచంద్ర కూడా విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అని చెబుతున్నాడు. మరి ఈ సాంగ్ లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల ఫ్రెండ్ షిప్ ని చూపించడానికి ఎలాంటి థీమ్ ని తీసుకున్నారు.. విజువల్స్ ని జక్కన్న ఏ రేంజ్ లో చూపించారు అనేది తెలియాలంటే ఆగస్ట్ 1వ తేదీ వరకు ఆగాల్సిందే.

కాగా కల్పిత కథతో రూపొందుతున్న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇందులో ఆలియా భట్ - హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ - శ్రియ - సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కె కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. డీవీవీ పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.