Begin typing your search above and press return to search.

బాలయ్యను అప్పటి నుంచే మూసలోకి నెట్టేసారా..?

By:  Tupaki Desk   |   25 Jan 2022 6:55 AM GMT
బాలయ్యను అప్పటి నుంచే మూసలోకి నెట్టేసారా..?
X
నటసింహం నందమూరి బాలకృష్ణ ఎలాంటి సినిమాలు చేసినా ఆదరించే ఓ వర్గం అభిమానులు ఎప్పుడూ ఉంటారు. అలానే ఎన్ని సూపర్ హిట్ చిత్రాలు చేసినా ట్రోల్ చేసే ఓ వర్గం ప్రేక్షకులు కూడా ఉంటారు. ఒక మూసలో బాలయ్య సినిమాలు చేయడం.. అందులో అనితరసాధ్యమైన యాక్షన్ ఘట్టాలు వంటివి ట్రోలర్స్ కు ఈ అవకాశం ఇవ్వడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.

నిజానికి బాలకృష్ణ కెరీర్ లో అనేక గొప్ప సినిమాలు చేశారు.. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. 'ఆదిత్య 369' 'ముద్దుల మావయ్య' 'భైరవ ద్వీపం' 'మంగమ్మ గారి మనవడు' 'రౌడీ ఇన్స్పెక్టర్' 'బంగారు బుల్లోడు' 'పెద్దన్నయ్య'.. ఇలా చెప్పుకుంటూ పోతే బాలయ్య ఖాతాలో అనేక మంచి సినిమాలు ఉన్నాయి. అయితే ఆయన కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా 'సమరసింహారెడ్డి' అని చెప్పొచ్చు.

మాస్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సమరసింహారెడ్డి' సినిమా 1999 సంక్రాంతి సీజన్ లో విడుదలైన వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. బాలయ్య మాస్ స్టామినా బాక్సాఫీస్ కు మరోసారి చూపించింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు బీజం వేసిన ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.

బి గోపాల్ టేకింగ్ - బాలకృష్ణ నటన - మణిశర్మ సంగీతం - పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ - అదిరిపోయే యాక్షన్ సీన్స్ వంటి అంశాలు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన 'సమరసింహారెడ్డి' సినిమా.. ఒకరకంగా చెప్పాలంటే బాలయ్య కెరీర్ ని ఉచ్ఛ స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడింది.

అయితే అదే 'సమరసింహారెడ్డి' సినిమా నటసింహం మూస ధోరణిలో కథలు ఎంచుకోడానికి కారణమైంది.. దర్శకులు అప్పటి నుంచి బాలయ్య కోసం అలాంటి కథలే రాసుకోడానికి వృధా ప్రయాస పడేలా చేసిందని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ కెరీర్ ని ఒక్కసారి గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థం అవుతుంది. ఈ క్రమంలో ఎన్ని సూపర్ హిట్ చిత్రాలు వచ్చినా.. భారీ వసూళ్లు సాధించిన సినిమాలు చేసినా.. అగ్ర హీరో అదే మూసలో ఇరుక్కుపోయారనే కామెంట్స్ కి మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు.

గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని బాలకృష్ణ ఇప్పుడు 'అఖండ' సినిమాతో అఖండమైన విజయాన్ని సాధించి మళ్ళీ ట్రాక్ లోకి ఎక్కారు. ఇదే క్రమంలో వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. అలానే అనిల్ రావిపూడితో ఓ సరికొత్త కథాంశంతో మూవీ చేయబోతున్నారు.

ఇక 'ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్ గా 'ఆదిత్య 999 మ్యాక్స్' అనే సోషయో ఫాంటసీ టైం ట్రావెల్ మూవీ చేసే ఆలోచనలో ఉన్నారు. మరి ఈ సినిమాలన్నీ 90వ దశకంలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన బాలయ్యను తిరిగి తీసుకొస్తాయేమో చూడాలి.