Begin typing your search above and press return to search.

ఇటీవలి సినిమాలన్నీ బయ్యర్లను భారీగా దెబ్బ కొట్టాయా..?

By:  Tupaki Desk   |   28 Sep 2022 4:07 AM GMT
ఇటీవలి సినిమాలన్నీ బయ్యర్లను భారీగా దెబ్బ కొట్టాయా..?
X
దసరా సెలవులను క్యాష్ చేసుకోడానికి పెద్ద సినిమాలు - క్రేజీ చిత్రాలు పండుగకు రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. దీంతో అంతకంటే ముందే కొన్ని చిన్న మీడియం రేంజ్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలోకి వచ్చేశాయి. వాటిలో నాగశౌర్య - సుధీర్ బాబు - శ్రీ విష్ణు - కిరణ్ అబ్బవరం వంటి టాలెంటెడ్ హీరోలు నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి.

నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో బెంచ్‌ మార్క్ స్టూడియోస్ పతాకంపై గాజులపల్లె సుధీర్ బాబు - బి మహేంద్రబాబు - కిరణ్ బళ్లపల్లి సంయుక్తంగా నిర్మించారు.

'ఆ అమ్మాయి..' దర్శక హీరోల కెరీర్ లో హ్యాట్రిక్ మూవీ కావడంతో అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషనల్ కంటెంట్ కు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.

'రాజావారు రాణిగారు' 'SR కల్యాణ మండపం' వంటి విజయాలు అందుకున్న కిరణ్.. ఇటీవల 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. శ్రీధర్ గాదె ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కోడి దివ్య దీప్తి నిర్మించారు.

ఇందులో కిరణ్ అబ్బవరం సరసన సంజనా ఆనంద్ మరియు సోనూ ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. ప్రీ రిలీజ్ కు ముందు హడావిడి చేసిన ఈ చిత్రం.. పేలవమైన కంటెంట్ తో జనాలను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఓపెనింగ్ డే వసూళ్లలో పర్వాలేదనిపించినా.. ఆ తరువాత రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ఫలితంగా కిరణ్ ఖాతాలో మరో ప్లాప్ వచ్చి చేరింది.

ఇక సెప్టెంబర్ 23న హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య "కృష్ణ వ్రింద విహారి" అనే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాతో పలకరించాడు. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో షిర్లే సెటియా హీరోయిన్ గా నటించింది. హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో ఉషా ముల్పూరి ఈ సినిమాని నిర్మించారు.

చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం వేచి చూస్తున్న శౌర్య.. KVV సినిమాపై హోప్స్ పెట్టుకున్నాడు. దీని ప్రమోషన్స్ కోసం బాగా కష్టపడ్డాడు. జనాల్లోకి తన సినిమాని తీసుకెళ్లాడానికి పాదయాత్ర కూడా చేశాడు. దీనికి ఫలితంగా తొలి రోజు ఈ చిత్రానికి మంచి టాకే వచ్చింది. ఫస్ట్ వీకెండ్ లో వసూళ్ళు కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే అదే జోరును వీక్ డేస్ లో కొనసాగించలేకపోయింది.

వర్సటైల్ హీరో శ్రీవిష్ణు నటించిన 'అల్లూరి' సినిమా కూడా ఈ నెల 23నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించారు. ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో శ్రీవిష్ణు నటించగా.. కయాదు లోహర్ హీరోయిన్ గా కనిపించింది. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు.

ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన 'అల్లూరి' సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ రోజు మార్నింగ్ షోలు క్యాన్సిల్ అవ్వడంతో ఆశించిన ఓపెనింగ్స్ రాలేదు. అయినప్పటికీ మొదటి వారాంతం పూర్తయ్యే సమయానికి డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. కానీ వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

ఓవరాల్ గా ఇటీవల రిలీజైన 'అల్లూరి' - 'కృష్ణ వ్రింద విహారి' 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'.. ఇలా అన్ని సినిమాలూ నష్టాలు మిగిల్చే పరిస్థితి ఏర్పడిందని ట్రేడ్ వర్గాలు నివేధించాయి. దీంతో బయ్యర్లు అంతా దాదాపు 70 శాతం వరకూ నష్టపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి దసరా రిలీజులైనా అందరికీ లాభాలు తెచ్చిపెట్టి టాలీవుడ్ బాక్సాఫీస్ కు మళ్లీ ఊపు తీసుకొస్తాయేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.