Begin typing your search above and press return to search.

నా పాత్ర విషయంలో శంకర్ కి హ్యాట్సాఫ్ చెప్పాలబ్బా!

By:  Tupaki Desk   |   28 May 2022 2:30 AM GMT
నా పాత్ర విషయంలో శంకర్ కి హ్యాట్సాఫ్ చెప్పాలబ్బా!
X
సునీల్ స్టార్ కమెడియన్ గా చక్రం తిప్పుతున్నప్పుడే హీరో వేషాల వైపు వెళ్లాడు. హీరోగా వరుస విజయాలను అందుకుంటూ వెళ్లాడు. హీరోగా ఆయనతో సినిమాలు నిర్మించడానికి పెద్ద బ్యానర్లు సైతం ఆసక్తిని కనబరిచాయి. ఆరంభంలో తాను హీరోగా చేసే సినిమాల్లోను కామెడీ ఉండేలా చూసుకున్న సునీల్, ఆ తరువాత కామెడీ పాళ్లు తగ్గిస్తూ వచ్చేసరికి తేడా కొట్టేసింది. బ్రహ్మానందం .. అలీ కూడా హీరోలుగా చేశారు. అయితే అదంతా సేఫ్ జోన్ కాదని తెలిసే వెంటనే వెనక్కి వచ్చేశారు. సునీల్ కూడా అలాగే వచ్చేశాడు .. కాకపోతే బాగా ఆలస్యమైపోయింది.

కమెడియన్ గా తాను వదిలేసి వెళ్లిన ప్లేస్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుందనుకుని వచ్చిన సునీల్ కి నిరాశే ఎదురైంది. తిరిగి తాను ఆ ప్లేస్ కి చేరుకోవడం అనుకున్నంత తేలిక కాదనే విషయం ఆయనకి అర్థమైపోయింది.

ఈ నేపథ్యంలోనే ఆయన విభిన్నమైన పాత్రలను పోషిస్తూ వెళుతున్నాడు. ఆ జాబితాలో విలన్ పాత్రలు కూడా ఉండటం విశేషం. మొత్తానికి కామెడీ పాత్రనే చేస్తాడనుకున్న సునీల్ హీరోగా మెప్పించి .. విలన్ గా ఒప్పించడం విశేషమే. ఒక వైపున ఈ తరహా పాత్రలు చేస్తూనే మళ్లీ కామెడీ పాత్రలపై ఆయన పట్టుబిగిస్తూ ఉండటం విశేషం. 'ఎఫ్ 3'లో ఆయన చేసిన పాత్ర అందుకు నిదర్శనంగా నిలుస్తుంది.

ఇక చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. వచ్చేనెల 2వ వారం నుంచి హైదరాబాదులో మరో షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ .. అంజలి ... సునీల్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తాజా ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను పోషించే పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇలాంటి పాత్రను నా కెరియర్లో ఇంతవరకూ పోషించలేదు. నా కెరియర్లోనే ఇది చాలా ప్రత్యేకమైన పాత్ర అని చెప్పాలి.

శంకర్ సినిమా అనగానే ఎగిరి గంతేసి ఒప్పుకున్నాను. ఇలాంటి అవకాశం అరుదుగా వస్తుంది కనుకనే అంతగా ఆనందపడ్డాను. నా పాత్రను శంకర్ డిజైన్ చేసిన తీరు నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. చరణ్ తో పాటు నేను సినిమా అంతా కనిపిస్తాను.

ఈ పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. నాకు మరింత మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక 'పుష్ప 2' సినిమాలోను సునీల్ రోల్ ను పవర్ఫుల్ గా తీర్చిదిద్దుతున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి ఏ పాత్ర ఇచ్చినా సునీల్ తన విశ్వరూపం చూపించేయాలని ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తున్నాడు.