నడక నేర్చిన నటన .. నాని

Wed Feb 24 2021 09:00:01 GMT+0530 (IST)

Happy Birthday Natural Star Nani From Tupaki Team

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాని స్థానం ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందుకు కారణం ఆయన ఎంచుకునే కథలు .. చేసే విలక్షణమైన పాత్రలు. కెమెరా ముందుకు రాగానే నాని తాను ఎవరనేది మరిచిపోతాడు .. ఆ పాత్రగా మారిపోతాడు. నరనరాన ఆ పాత్ర ప్రవేశిస్తుంది .. ప్రవహిస్తుంది. అందుకే అంతా కలిసి ఆయనకి 'నేచురల్ స్టార్' అనే బిరుదును ఇచ్చేశారు. నానీని తెరపై కాకుండా మన పక్కింట్లోనో .. మన కాలనీ వీధుల్లోనో చూసినట్టుగా ఉంటుంది. అంత సహజంగా పాత్రలో ఒదిగిపోవడం .. చెలరేగిపోవడం ఆయన ప్రత్యేకత.చిత్రపరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి .. తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న అతికొద్దిమంది హీరోల్లో నాని ఒకరు. క్లాప్ బోర్డు పట్టుకుని సెట్లో తిరిగే ఓ కుర్రాడు ఈ రోజున క్లాప్స్ కొట్టించుకునే స్థాయికి చేరుకోవడం సాధారణమైన విషయమేం కాదు. దాని వెనుక ఆయన కృషి .. పట్టుదల .. కార్యదీక్ష ఉన్నాయి. ఇక్కడ తడబడకూడదు .. కష్టాలపై కలబడాలి .. నిలబడాలి. వెనకడుగు వేయకుండా వెన్ను తట్టుకుంటూ ముందుకువెళ్లాలి. ఆ పనిలో సక్సెస్ అయిన హీరోగా నాని కనిపిస్తాడు.

'అష్టాచమ్మా' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన నానీ ఆ తరువాత అంచలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున ఈ స్థాయికి చేరుకున్నాడు. ఈ పుష్కరకాలంలో ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించాడు .. వీలైనన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా డబుల్ హ్యాట్రిక్ ను సాధించిన ఘనత ఆయన కెరియర్లో కనిపిస్తుంది. ఒకప్పుడు నిర్మాతల కోసం ఎదురుచూసిన నాని ఈ రోజున తనే నిర్మాతగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఏడాదికి మూడు సినిమాలైనా చేయాలనే ఒక నియమంతో ఆయన ముందుకు వెళుతుండటం విశేషం.

ఈ ఏడాది కూడా 'టక్ జగదీశ్' .. 'శ్యామ్ సింగ రాయ్' .. 'అంటే .. సుందరానికీ!' అనే సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. వైవిధ్యభరితమైన జోనర్లలో రూపొందుతున్న ఈ సినిమాలపై అందరిలోను ఆసక్తి ఉంది. నిరంతరం శ్రమించేవారి నుంచి సక్సెస్ తప్పించుకోలేదనడానికి నాని ఒక నిర్వచనంలా అనిపిస్తాడు .. నిదర్శనంగా కనిపిస్తాడు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నానీకి శుభాకాంక్షలు అందజేస్తూ ఆయన నుంచి మరిన్ని విభిన్నమైన .. విజయవంతమైన సినిమాలు రావాలని కోరుకుందాం!