స్పెషల్ స్టోరీ : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన 'దర్శకధీరుడు'

Sat Oct 10 2020 18:30:05 GMT+0530 (IST)

Special Story: 'Director' who took Telugu cinema fame all over the world

భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకరు. 'బాహుబలి' చిత్రాలతో మన తెలుగు సినిమాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకొనిపోయాడని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతీ టెక్నీషియన్ ప్రతీ నటీనటులు కోరుకుంటారు. టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్న దర్శకధీరుడు రాజమౌళి తన ఆలోచలను వెండితెరపై ఆవిష్కరించి విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తుంటాడు. పర్ఫెక్షన్ కోసం అంతలా కష్టపడతాడు కాబట్టే సినీ అభిమానులు అతన్ని 'జక్కన్న' అని పిలుచుకుంటూ ఉంటారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ స్థాయి నుంచి ఇండియన్ సినిమాలోనే టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందడం వెనుక ఎంతో కృషి పట్టుదల ఉన్నాయి. బుల్లితెరపై సీరియల్ దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు వెండితెరపై అద్భుతాలు సృష్టిస్తున్నాడు. హీరోయిజం చూపించడంలో.. ప్రతి సీన్ ని పవర్ ఫుల్ గా ఎలివేట్ చేయడంలో.. ఎమోషన్స్ రూపంలో సినిమా థ్రిల్స్ కలిగించడంలో ఎవరైనా రాజమౌళి తర్వాతే అని చెప్పవచ్చు. అందుకే ఇప్పటి వరకూ పరాజయం అంటే తెలియకుండా.. తన పేరులో ఉండే యస్.యస్ ను సూపర్ సక్సెస్ గా మలుచుకున్న దర్శకుడుగా రాజమౌళి నిలిచారు.ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు శిష్యుడిగా 'స్టూడెంట్ నెం.1' చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు రాజమౌళి. అప్పటి వరకు టీవీ సీరియల్స్ తీసిన అనుభవం ఉన్న రాజమౌళి.. తొలి సినిమాతోనే తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత 'సింహాద్రి' సినిమాతో తన విజయయాత్రను కొనసాగించాడు. ఈ క్రమంలో 'సై' 'ఛత్రపతి' 'విక్రమార్కుడు' 'యమదొంగ' 'మగధీర' 'మర్యాద రామన్న' 'ఈగ' వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే అది ఏ హీరోతోనైనా కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే అనుకునే రేంజ్ కి ఎదిగాడు. ఇక ''బాహుబలి : ది బిగినింగ్'' ''బాహుబలి: ది కంక్లూషన్'' సినిమాలతో దేశవ్యాప్తంగా తెలుగు సినిమా స్టామినా ఏంటో చూపించాడు. అందుకే 'బాహుబలి: ది కంక్లూషన్' సినిమా భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.

'బాహుబలి' సినిమాతో రాజమౌళి జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం అవార్డు సంపాదించి పెట్టిన ఫస్ట్ తెలుగు డైరెక్టర్ గా నిలిచారు. 'బాహుబలి- ద బిగినింగ్' సినిమా తర్వాత రాజమౌళికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కేవలం పన్నెండు చిత్రాల అనుభవం ఉన్న దర్శకుడికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడిందంటే ఆయన సత్తా ఏంటో తెలియజేస్తుంది. ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' అనే భారీ మల్టీస్టారర్ ని చెక్కే పనిలో ఉన్నాడు జక్కన్న. ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 20 ఏళ్ళ సినీ ప్రస్థానంలో అద్భుతమైన చిత్రాలను అందించి 'దర్శకధీరుడు'గా.. 'జక్కన్న'గా పిలవబడుతున్న ఎస్.ఎస్. రాజమౌళి బర్త్ డే నేడు (అక్టోబర్ 10). ఆయన మరెన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించి మరెన్నో మైలురాళ్ళు అధిగమించాలని కోరుకుంటూ 'తుపాకీ డాట్ కామ్' రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.