'గాడ్ ఫాదర్' మూవీ రివ్యూ

Wed Oct 05 2022 18:13:43 GMT+0530 (India Standard Time)

Godfather Review

'గాడ్ ఫాదర్' మూవీ రివ్యూ
నటీనటులు: చిరంజీవి-నయనతార-సత్యదేవ్-మురళీ శర్మ- సునీల్-బ్రహ్మాజీ-సముద్రఖని-సర్వదామన్ బెనర్జీ-సల్మాన్ ఖాన్ (క్యామియో తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: నిరవ్ షా
కథ: మురళి గోపీ
మాటలు: లక్ష్మీ భూపాల
నిర్మాణం: మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్-కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: మోహన్ రాజాకొన్ని నెలల కిందటే 'ఆచార్య'తో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ గాయానికి మందు అవుతుందని చిరుతో పాటు మెగా అభిమానులు కూడా ఆశిస్తున్న చిత్రం 'గాడ్ ఫాదర్'. మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజా రూపొందించాడు. దసరా కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీకే రామ్ దాస్ (సర్వదామన్ బెనర్జీ) హఠాన్మరణంతో ఆయన స్థానంలోకి ఎవరు రావాలనే ప్రశ్న తలెత్తుతుంది. ఆయన అల్లుడైన జై (సత్యదేవ్) మొత్తం ఎమ్మెల్యేలందరినీ తన గుప్పెట్లో పెట్టుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని పన్నాగం పన్నుతాడు. రామ్ దాస్ కూతురైన అతడి భార్య సత్యప్రభ (నయనతార) కూడా అతణ్ని నమ్ముతుంది. ఆ సమయంలోనే సత్య ఎంతగానో అసహ్యించుకునే ఆమె సవతి సోదరుడు బ్రహ్మ (చిరంజీవి) రంగంలోకి దిగుతాడు. ఇంతకీ బ్రహ్మ నేపథ్యమేంటి.. రామ్ దాస్ కుటుంబాన్ని కబళించాలని చూస్తున్న జైకి అతనెలా అడ్డుకట్ట వేశాడు.. ఈ క్రమంలో బ్రహ్మకు ఎదురైన సవాళ్లేంటి.. వాటిని అతను ఎలా ఛేదించాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

'గాడ్ ఫాదర్' ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో రీమేక్ సినిమాలు చేయడాన్ని తప్పుబడుతున్నట్లుగా ఒక ప్రశ్న వేస్తే చిరు చెప్పిన సమాధానం.. రీమేక్ అంటే ఒక ఛాలెంజ్.. అది అంత సులువైన విషయం కాదు అని. మాతృకను మరింత మెరుగ్గా తీర్చిదిద్ది ప్రేక్షకులను అలరిస్తే తప్పేంటని. చిరు చెప్పింది అక్షరాలా నిజం.  ఈ రోజుల్లో రీమేక్ సినిమా తీయడం కంటే పెద్ద ఛాలెంజ్ మరొకటి లేదు. అన్ని భాషల చిత్రాలనూ అందరూ చూసేస్తున్నపుడు.. అందులోనూ తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఓ మలయాళ పాపులర్ సినిమాను రీమేక్ చేయడం మామూలు ఛాలెంజ్ కాదు. ఐతే ఉన్నదున్నట్లు తీస్తే జిరాక్స్ కాపీ అని.. మార్పులు చేర్పులు చేస్తే చెడగొట్టారు అనే విమర్శలు ఎదురయ్యే పరిస్థితుల్లో బ్యాలెన్స్ తప్పకుండా సినిమాను తీర్చిదిద్ది ప్రేక్షకులను మెప్పించడం కత్తి మీద సామే. ఈ విషయంలో 'గాడ్ ఫాదర్' టీం చిరు తమ్ముడైన పవన్ కళ్యాణ్ సినిమాలనే స్ఫూర్తిగా తీసుకున్నట్లుంది. గబ్బర్ సింగ్.. భీమ్లా నాయక్ లాంటి చిత్రాల కథలను వేరే భాష నుంచి తీసుకుని హీరో ఇమేజ్.. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్చిన తీరు ప్రశంసనీయం. 'గాడ్ ఫాదర్' టీం కూడా సరిగ్గా అదే పని చేసింది. 'లూసిఫర్'లో మూల కథతో పాటు.. అందులోని ముఖ్య పాత్రలు.. కీలక ఎపిసోడ్లను తీసుకుని.. వాటికి అదనపు పాత్రలు.. సన్నివేశాలతో పాటు మన ప్రేక్షకుల టేస్టుకు తగ్గ మసాలాలన్నీ జోడించి 'గాడ్ ఫాదర్'ను ఎంగేజింగ్ గా తీర్చిదిద్దింది. మాతృకతో పోల్చి చూసుకున్నా.. మామూలుగా చూసినా 'గాడ్ ఫాదర్' రీజనబుల్ గా అనిపిస్తుంది. ఇది మరీ ప్రేక్షకులను ఇది ఉర్రూతలూగించేసే సినిమా కాదు. కానీ రెండున్నర గంటల కాలక్షేపానికి ఢోకా లేకుండా.. చిరు అభిమానులకు.. మాస్ ప్రేక్షకులకు ఆద్యంతం వినోదం పంచుతూ సాగుతుంది 'గాడ్ ఫాదర్'.

'గాడ్ ఫాదర్' ఒక రీమేక్ అన్న విషయాన్ని పక్కన పెట్టేసి చూస్తే.. ఇది మరీ కొత్తగా అనిపించే సినిమా కాదు. అలా అని మరీ రొటీన్ గా సాగిపోయే మసాలా మూవీ కూడా కాదు. 'లీడర్' సినిమాను కమర్షియలైజ్ చేస్తే ఎలా ఉంటుందన్నది 'గాడ్ ఫాదర్'లో చూడొచ్చు. అందులో మాదిరే ఇక్కడా ముఖ్యమంత్రి చనిపోయాక ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే నేపథ్యంలో కథ నడుస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కూతురి ముందు ముసుగేసుకుని తిరుగుతూ మంత్రాంగం నడిపించే ఆమె భర్త అయిన.. అతడి కుతంత్రాలకు అడ్డుగా నిలిచే హీరో.. వీరి మధ్య ఎత్తులు పై ఎత్తులతో 'గాడ్ ఫాదర్' నడుస్తుంది. పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి.. రీఎంట్రీలో 'ఖైదీ నంబర్ 150'తో బ్లాక్ బస్టర్ విజయాన్నందుకుని.. 'సైరా'తోనూ ఓకే అనిపించి.. 'ఆచార్య'తో నిరాశ పరిచిన చిరు.. బాక్సాఫీస్ ఫలితాలను పక్కన పెడితే ఆ సినిమాల్లో తనకు సూటయ్యే పాత్రలు చేయలేదన్న అసంతృప్తి ప్రేక్షకుల్లో ఉంది. ఐతే ఎట్టకేలకు ఆయన తనకు సరిగ్గా సూటయ్యే పాత్రలో కనిపించాడు 'గాడ్ ఫాదర్'లో. నడి వయస్కుడిగా కనిపిస్తూ.. రొటీన్ గా హీరోయిన్ తో రొమాన్స్ చేయకుండా.. ఫార్ములాటిక్ పాటలు.. ఫైట్లు అంటూ ఒక ఛట్రంలో ఉండిపోకుండా.. కథానుసారం సాగిపోయే కథలో ఒక పాత్రధారిగా చిరు దర్శనమివ్వడం ఆకట్టుకుంటుంది. పైన చెప్పుకున్న మసాలాలేమీ లేకపోయినా.. చిరుకు ఇందులో ఎలివేషన్లేమీ తక్కువ లేదు. చిరు కామ్ గా కనిపిస్తున్నా పాత్రలో బలం ఉండడంతో.. చక్కటి సన్నివేశాలు పడడంతో సందర్భానుసారం అది బాగానే ఎలివేట్ అయింది. అభిమానులతో.. మాస్ ప్రేక్షకులతో విజిల్స్ కొట్టించే సన్నివేశాలకు ఇందులో లోటు లేదు.

'గాడ్ ఫాదర్'లో కథ కొంచెం నెమ్మదిగానే మొదలవుతుంది. చిరు ఎంట్రీ ఇచ్చాకే ఉత్సాహం వస్తుంది. అక్కడి నుంచి కథనం పరుగులు పెడుతుంది. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో హీరోకు ఎలివేషన్లు ఇచ్చేలా ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే.. సన్నివేశాలు రాసుకున్నాడు మోహన్ రాజా. మొత్తం తన గుప్పెట్లో ఉందని.. ఇక తానే సీఎం అనుకున్న సమయంలో పార్టీ మీటింగ్ లో అతడికి ఝలక్ తగిలే సన్నివేశంలో దర్శకుడు మోహన్ రాజా ప్రతిభ కనిపిస్తుంది. ఓవైపు ఇలా ఇంటలిజెంట్ సీన్ తో క్లాస్ ప్రేక్షకులను మెప్పిస్తూనే మరోవైపు యాక్షన్ ఎపిసోడ్ తో మాస్ ప్రేక్షకులనూ అలరించాడు దర్శకుడు. ప్రథమార్ధంలో చాలా వరకు విలన్ వైపే బలం చూపిస్తూ.. హీరోను అణచి వేస్తున్నట్లే సన్నివేశాలు చూపించడం తెలివైన ఎత్తుగడ. ఇంటర్వెల్ దగ్గర భారీ యాక్షన్ సీక్వెన్స్ లాంటిదేమీ ప్లాన్ చేయకుండా.. జైల్లో ఉన్న హీరో ఒక్క మాట మాట్లాడకుండా కళ్లతోనే శాసించేట్లు చూపిస్తూ ఇచ్చిన ఎలివేషన్ మరో హైలైట్. ప్రథమార్ధంలో చకచకా సాగిపోయే కథనం.. ద్వితీయార్ధం ఆరంభంలో కొంచెం నెమ్మదించిన భావన కలుగుతుంది. కాసేపు చిరు సైడ్ అయిపోవడంతో సినిమా కూడా కొంచెం పక్కదారి పట్టినట్లు అనిపిస్తుంది. కానీ హీరో తిరిగి పుంజుకుని విలన్ కు రిటార్ట్ ఇవ్వడం మొదలుపెట్టాక కథనం మళ్లీ పరుగులు పెడుతుంది. చివరి 40 నిమిషాల్లో ఎలివేషన్లకు లోటు లేదు. సెంటిమెంట్.. డ్రామా కూడా బాగా పండాయి కొన్ని సన్నివేశాల్లో. ఇంటర్వెల్ ముంగిట.. క్లైమాక్సులో సల్మాన్ ఖాన్ తో సందడి చేయించారు. కానీ ఆ సీన్లేమీ అంత గొప్పగా అనిపించవు. మన వాళ్లు సల్మాన్ తో కనెక్ట్ కావడం కష్టమే అనిపిస్తుంది. ఆ స్థానంలో మన స్టార్ హీరోలెవరైనా కనిపించి ఉంటే ఎలివేషన్ అదిరిపోయేది. సినిమా స్థాయి పెరిగేది. ముగింపు సన్నివేశాలు బాగున్నాయి. ఓవరాల్ గా సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా.. సరైన ఎలివేషన్లతో సాగుతూ.. చిరు అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులనూ మెప్పించేలా సాగింది. మరీ అంచనాలు పెట్టుకోకుండా.. హీరో ఎలివేషన్లతో కూడిన ఒక పొలిటికల్ డ్రామాను చూడ్డానికి ప్రిపేరైతే 'గాడ్ ఫాదర్' బాగానే ఎంగేజ్ చేస్తుంది.

నటీనటులు:

చాన్నాళ్లకు చిరంజీవి తనకు నప్పే సరైన పాత్ర చేశాడు. పాత్రకు తగ్గట్లు పెద్దగా హడావుడి చేకుండా.. కూల్ గా కనిపిస్తూ మంత్రాంగాన్ని నడిపించే కింగ్ మేకర్ పాత్రలో చిరు ఆద్యంతం ఆకట్టుకున్నాడు. డైలాగ్ డెలివరీ విషయంలో అక్కడక్కడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది తప్పితే అంతకుమించి చిరులో తప్పులు ఎంచడానికేమీ లేదు. ఫిజికల్ గా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఈ పాత్ర ఇవ్వలేదు. కొన్ని సన్నివేశాల్లో చిరు కళ్లతో పలికించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. చిరు మార్కు మాస్ యాక్షన్ మూమెంట్స్ తక్కువగా ఉండడం.. డ్యాన్సులు లేకపోవడం అభిమానులను కొంత నిరాశ పరచవచ్చు. చిరు తర్వాత పెర్ఫామెన్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సత్యదేవ్ గురించే. ఎలాంటి ఇమేజ్ లేని అతను చిరుకు ఎదురుగా విలన్ పాత్రలో ఏమాత్రం నిలబడతాడో అని సందేహాలు చాలామందికి ఉన్నాయి. ఐతే ఇమేజ్ లేకపోయినా.. తన నటనతో ఆ లోటును అతను భర్తీ చేశాడు. చిరు ఎదురుగా చాలా సన్నివేశాల్లో దీటుగా నిలబడ్డాడంటే అందుకు అతడి ఇంటెన్స్ యాక్టింగే కారణం. అయితే సత్యదేవ్ కు ఉన్న సాఫ్ట్ ఇమేజ్ వల్ల ఏమో.. మాతృకలో వివేక్ ఒబెరాయ్ తో పోలిస్తే ఈ పాత్ర బలమైన విలన్ లాగా అయితే కనిపించదు. సైరాలో చిరు భార్యగా కనిపించిన నయనతారను ఇందులో ఆయనకు చెల్లెలిగా చూడడం కొంచెం ఇబ్బందికరమే కానీ.. ఆ పాత్రకు నయన్ పూర్తి న్యాయం చేసింది. తన నటన ఆకట్టుకుంటుంది. మురళీ శర్మ తనకు తగ్గ పాత్రలో మెరిశాడు. సునీల్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ఓకే అనిపించాడు. సముద్రఖని పాత్ర సాధారణంగా అనిపిస్తుంది. బ్రహ్మాజీ.. మిగతా నటీనటులు ఓకే. సల్మాన్ క్యామియో రోల్ లో అంతగా ఆకట్టుకోలేదు.

సాంకేతిక వర్గం:

తమన్ పాటలు.. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లు బాగానే కుదిరాయి. పాటలు మరీ గుర్తుంచుకునేలా లేవు కానీ.. సినిమాలో సందర్భానికి తగ్గట్లు బాగానే నడిచిపోతాయి. నేపథ్య సంగీతంతో చాలా సన్నివేశాలను తమన్ పైకి లేపే ప్రయత్నం గట్టిగానే చేశాడు. చిరు అభిమానులను.. మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా అతడి నేపథ్య సంగీతం సాగింది. నిరవ్ షా ఛాయాగ్రహణం బాగుంది. మంచి క్వాలిటీ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి ఆయన విజువల్స్. నిర్మాణ విలువల విషయంలో ఏమీ రాజీ పడలేదు. ఇప్పటిదాకా చిన్న.. మీడియం రేంజ్ సినిమాలకే పని చేస్తూ వచ్చిన టాలెంటెడ్ రైటర్ లక్ష్మీ భూపాల.. ఓ పెద్ద సినిమాకు మాటలు రాసే అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. ''శత్రువు గుర్తించని గెలుపు ఓటమి కంటే హీనం'' లాంటి డైలాగులు భలే అనిపిస్తాయి. తొలిసారి పార్టీ సమావేశంలో నయనతార ప్రసంగించేటపుడు వచ్చే డైలాగ్స్ లక్ష్మీ భూపాల కలం పదునును చూపిస్తాయి. ఇక దర్శకుడు మోహన్ రాజా రీమేక్ సినిమాలు బాగా తీస్తాడని తనకున్న పేరును నిలబెట్టుకున్నాడు. మాతృకను ఉన్నదున్నట్లు దించేయకుండా.. చిరు ఇమేజ్.. మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసి.. సినిమాను పకడ్బందీగానే తీర్చిదిద్దాడు. చిరును అతను ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. అతడి దర్శకత్వ ప్రతిభను చాటే సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయి.

చివరగా: గాడ్ ఫాదర్.. ఎంగేజింగ్ పొలిటికల్ డ్రామా

రేటింగ్-2.75/5