తెలుగులో మళ్లీ సొంత గొంతు వినిపిస్తున్న బబ్లీ బ్యూటీ..!

Wed Jun 29 2022 14:00:01 GMT+0530 (IST)

Glamours Beauty Rashi Khanna With Own Voice Dubbing

గార్జియస్ బ్యూటీ రాశీఖన్నా ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీబిజీగా గడుపుతోంది. తెలుగుతో పాటుగా తమిళ మలయాళ హిందీ భాషల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ క్రమంలో తెలుగు భాష కూడా నేర్చుకొని సొంత వాయిస్ తోనే డబ్బింగ్ చెప్పగలిగే స్టేజ్ కు రావడం విశేషం.టాలీవుడ్ లో ఎక్కువగా బయట ఇండస్ట్రీల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న హీరోయిన్లు ఉంటారు కాబట్టి.. సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఈతరం కథానాయికలు మాత్రం తమ పాత్రలకు సొంత గాత్రం అందిస్తూ అభిమానులను ఫిదా చేస్తున్నారు. ఆ లిస్టులోకి రాశీఖన్నా కూడా చేరింది. కాకపోతే మిగతా వారి కంటే భిన్నంగా చేసింది.

తెలుగమ్మాయి కాకపోయినా తన రెండో చిత్రం 'జోరు' లో ఏకంగా ఓ పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది రాశీ. ఆ తర్వాత 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా కోసం తన వాయిస్ తోనే డబ్బింగ్ చెప్పుకుంది. ఇప్పుడు లేటెస్టుగా 'థ్యాంక్యూ' చిత్రం కోసం రాశీఖన్నా తన సొంత గొంతును వినిపించబోతున్నట్లు తెలుస్తోంది.

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ''థాంక్యూ''. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా మెయిన్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2022 జూలై 22న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం రాశీ సొంత వాయిస్ తో డబ్బింగ్ చెప్పుకుంటోంది.

నిజానికి రాశీ నార్త్ అమ్మాయి అయినప్పటికీ.. తెలుగు మరియు తమిళ భాషలను అనర్గళంగా మాట్లాడగలదు.. వినగలదు మరియు అర్థం చేసుకోగలదు. సినిమా ఫంక్షన్స్ లో తెలుగులోనే మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. రాబోయే అన్ని సినిమాల్లోనూ రాశీ తన ఓన్ వాయిస్ తోనే డబ్బింగ్ చెప్తుందేమో చూడాలి.

ఇకపోతే రాశీఖన్నా హీరోయిన్ గా నటించిన మరో తెలుగు సినిమా 'పక్కా కమర్షియల్' రిలీజ్ కు రెడీ అయింది. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జులై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలానే తమిళ్ లో కార్తీ సరసన 'సర్దార్'.. ధనుష్ తో 'తిరుచిత్రంబలం' వంటి సినిమాలు చేస్తోంది రాశీ.

అంతేకాదు దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత 'యోధ' అనే సినిమాతో బాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్' అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. త్వరలో 'ఫర్జి' అనే ఒరిజినల్ తో పలకరించబోతోంది.