ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయిన ఘంటసాల రత్నకుమార్

Thu Jun 10 2021 12:00:01 GMT+0530 (IST)

Ghantasala Ratnakumar who left without fulfilling that desire

తెలుగువారు ఉన్నంత వరకు ఘంటసాలను ఏ తరం మర్చిపోలేదు. గానామృతానికి అసలుసిసలు అర్థంగా నిలిచే ఘంటసాల వెంకటేశ్వరరావు వారి కుమారుడే ఘంటసాల రత్నకుమారుడు. యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతాడు. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడన్న మాటకు భిన్నంగా తన తండ్రి పాటలతో అలరిస్తే.. ఆయన కుమారుడు రత్నకుమార్ మాటలతో అలరించాడు.అంతకు మించి తనదైన ముద్ర వేశాడు. హీరో ఎవరైనా కానీ.. ఆయన గాత్ర మహిమతో ఎవరితోనైనా ఇట్టే ఇమిడిపోవటం రత్నకుమార్ ప్రత్యేకత.కెరీర్ లో వెయ్యికి పైగా (సరిగ్గా చెప్పాలంటే 1090) సినిమాలు చేయటమే కాదు.. తెలుగు.. తమిళం.. మలయాళం.. హిందీ.. సంస్కృత భాషల్లో డబ్బింగ్ చెప్పిన టాలెంట్ ఆయన సొంతం. పరభాషా హీరోలు ఎవరైనా కావొచ్చు.. వారి వాయిస్ లో విలక్షణమైన బేస్ ఉందంటే.. అది రత్నకుమార్ వాయిస్సే అవుతుంది. హీరోలు అర్జున్.. కార్తీక్.. అరవింద స్వామి.. సల్మాన్.. షారుక్ ఇలా హీరోలు ఎవరైనా సరే.. వారికి రత్నకుమార్ వాయిస్ తోడైతే ఆ అందమే వేరు. డబ్బింగ్ చెప్పటమే కాదు.. మాటల రచయితగా కూడా కొన్ని సినిమాలకు పని చేశారు.

ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుకు మొత్తం ఆరుగురు సంతానం కాగా.. అందులో ముగ్గురు అమ్మాయిలు.. ముగ్గురు అబ్బాయి. అందులో రత్నకుమార్ రెండోవారు. ఆయన తప్పించి.. వారి కుటుంబంలో మరెవరూ సినిమా రంగంలోకి రాలేదు. రత్నకుమార్ కుమార్తె వీణ తాత వారసత్వాన్ని అందిపుచ్చుకున్నట్లుగా చెప్పాలి. ఆమె అందాల రాక్షసి.. తమిళంలో ఉరుం సినిమాల్లో గాయనిగా మంచి పేరు తెచ్చుకున్నారు.

సినిమా రంగంలో సుదీర్ఘ కాలం నుంచి సాగుతున్న రత్నకుమార్ కు ఒక కోరిక ఉండేది. మంచి సబ్జెక్టుతో ఒక సినిమాకు దర్శకత్వంవహించాలని. ఇదే విషయాన్ని ఆయన తరచూ చెబుతుండేవారు. తన తీరని కోరిక ఏదన్నప్పుడు సినిమాకు దర్శకత్వమన్న మాట చెప్పేవారు. తాను దర్శకత్వం వహించే సినిమాకు కథ.. మాటలు..పాటలు కూడా సిద్ధం చేసుకున్నట్లు పలుమార్లు చెప్పారు. మంచి నిర్మాత దొరికితే త్వరలోనే సినిమా తీస్తానని చెప్పిన ఆయన.. ఆ కోరికను తీర్చుకోకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కోరిక తీర్చుకోకుండా ఎలా వెళ్లిపోతావ్ రత్నకుమార్? అంటూ ఆయన్ను అభిమానించే వారంతా ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.