జార్జ్ రెడ్డి: పవన్ పేరును మామూలుగా వాడడం లేదుగా!

Tue Nov 19 2019 12:33:55 GMT+0530 (IST)

'George Reddy' team using Pawan for promotions

ఈమధ్యకాలంలో ట్రైలర్ తోనే ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం 'జార్జ్ రెడ్డి'. జీవన్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ మాధవ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి సంఘం నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిందనే విషయం తెలిసిందే.  కాలేజ్ యూనియన్లు.. విద్యార్ధి దశలో రాజకీయాలు..సమానత్వం కోసం పోరాటం అన్నీ అంశాలు ఈ సినిమాలో ఉండడంతో సినిమా యూత్ కు కనెక్ట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.ఇదిలా ఉంటే ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మద్దతు కూడా లభించింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ చూసి 'జార్జ్ రెడ్డి' టీమ్ సభ్యులను మెచ్చుకున్నారని వార్తలు వచ్చాయి. 'జార్జ్ రెడ్డి' ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ హాజరవుదామని అనుకున్నారట కానీ ఈ కార్యక్రమానికి పోలీసు శాఖ వారి అనుమతి రాకపోవడంతో క్యాన్సిల్ అయింది.  సాధారణంగానే చాలా సినిమాల్లో పబ్లిసిటీ కోసం పవన్ పేరును.. పవర్ స్టార్ ఇమేజ్ ని వాడుకుంటూ ఉంటారు.  ఇప్పుడు 'జార్జ్ రెడ్డి' టీమ్ కూడా అలానే ఫుల్ గా పవన్ పేరును వాడుకునేందుకు డిసైడ్ అయినట్టున్నారు.

ఈ సినిమా హీరో సందీప్ మాధవ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో జార్జ్ రెడ్డి పాత్రలో నటించాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారనే విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే పవన్ కు 'జార్జ్ రెడ్డి' ట్రైలర్  నచ్చిందనే విషయానికి విపరీతంగా ప్రచారం లభించింది.  ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోయినా పవన్ వస్తున్నారనే వార్త కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఏకంగా "పవన్ స్వయంగా జార్జ్ రెడ్డి పాత్రలో నటించాలని అనుకున్నారు" అంటే అది కూడా జార్జ్ రెడ్డి సినిమా ప్రమోషన్స్ కు ఉపయోగపడే అంశమే.  చూస్తుంటే 'జార్జ్ రెడ్డి' కి పవన్ పవర్ ను ఫుల్ గా జోడిస్తున్నారనిపిస్తోంది.