ఏపీ సీఎం నిధికి గీతా ఆర్ట్స్ 10లక్షలు

Thu Nov 25 2021 09:22:52 GMT+0530 (IST)

Geeta Arts 10 lakhs to AP CM fund

ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్ని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రే ఊళ్లకు ఊళ్లు జలమయం అయ్యాయి. ఎటూ తప్పించుకోలేని పరిస్థితి. మరోవైపు పంట నష్టం తీవ్రంగా ఉందని రిపోర్ట్ అందింది. అయితే ఈ విలయం నుంచి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వ సాయం చాలా అవసరం.ప్రభుత్వానికి కూడా ఆర్థిక విరాళాల సాయం అత్యావశ్యకం. అయితే వరదల వేళ ప్రతిసారీ టాలీవుడ్ నుంచి భారీ విరాళాలు అందుతాయన్న సంగతి తెలిసిందే.

ఈసారి సీఎం నిధికి 10లక్షల విరాళాన్ని ప్రకటిస్తూ గీతా ఆర్ట్స్ సంస్థ అందరికంటే ముందుగా సేవ కోసం ముందుకు వచ్చింది. ప్రతిసారీ ఎవరైనా ప్రకటిస్తే దానిని అనుసరించి ఇతరులు సాయం ప్రకటిస్తుంటారు. ప్రకృతి వైపరీత్యాల తీవ్రత దృష్ట్యా విరాళాల మొత్తాన్ని అందిస్తున్నారు.

తొలిగా అగ్ర నిర్మాణ సంస్థ నుంచి ప్రకటన వెలువడింది కాబట్టి ఇతర ప్రముఖ బ్యానర్ల నుంచి కూడా విరాళాలు అందించే అవకాశం ఉంటుంది. అలాగే స్టార్లు టాప్ టెక్నీషియన్లు విరాళాల్ని ప్రకటిస్తారనే భావిద్దాం.

ఓవైపు ఏపీ ప్రభుత్వం సినీఇండస్ట్రీలో అవకతవకల్ని సరిచేసేందుకు కంకణం కట్టుకుంది. ముఖ్యంగా బ్లాక్ టికెటింగ్ దాందాపైన.. జీఎస్టీ-పన్నుల ఎగవేతలు దోపిడీ పైనా ఉక్కు పాదం మోపుతోంది.

అదనపు షోలు అదనపు బాదుడుని నిషేధాజ్ఞలు విధించింది. ఇలాంటి సన్నివేశంలో ఇండస్ట్రీ నుంచి స్పందనలు ఎలా ఉంటాయో అనుకుంటుండగా.. జీఏ సంస్థ ముందుగా విరాళం ప్రకటించడం ఆశ్చర్యకరం.

ఇండస్ట్రీలో రెండు డజన్ల అగ్ర నిర్మాణ సంస్థలు ఉన్నాయి. డజనుకు పైగా అగ్ర హీరోలున్నారు. వీరి నుంచి విరాళాల ప్రకటన ఎలా ఉండనుందో వేచి చూడాలి. ఇటీవల కరోనా సమయంలోనూ మన స్టార్ల సాయం మర్చిపోలేం. ప్రతిసారీ మేమున్నాం అంటూ ముందుకొస్తుంటారు.

పొరుగున ఉన్న చెన్నై సహా కర్నాటక -కేరళ వరదల వేళ కూడా స్పందించిన మన స్టార్లు ఆంధ్రప్రదేశ్ లో ఇంత జరిగితే వదిలేస్తారని అనుకోలేం. కాస్త వేచి చూడాలి.