ఫస్ట్ లుక్: ఇది భిన్నమైన గ్యాంగ్.. రెగ్యులర్ కాదు!

Mon Jul 15 2019 19:21:02 GMT+0530 (IST)

Gang Leader First Look

న్యాచురల్ స్టార్ నాని.. టాలెంటెడ్ ఫిలిం మేకర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'గ్యాంగ్ లీడర్'.  జులై 12 వ తారీఖున ఈ సినిమా ప్రీ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నాని చేతిలో గ్యాంగ్ మెంబర్స్ అందరూ చేతులు పెట్టి ప్రామిస్ చేస్తున్నట్టుగా ఆ ప్రీ లుక్ ఉంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.ఈ ఫస్ట్ లుక్ ను నాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి "బామ్మ.. వరలక్ష్మి.. ప్రియ.. స్వాతి.. చిన్ను  రివెంజర్స్ అసెంబుల్" అంటూ ట్వీట్ చేశారు. రివెంజర్స్ అసెంబుల్ అంటే.. ప్రతీకారం తీర్చుకునేందుకు ఒక చోట చేరారు అని అర్థం కదా.  ఫస్ట్ లుక్ పోస్టర్ లో అందరూ ఒక డాబా మీద నిలుచుని  బైనాక్యులర్స్ పట్టుకుని ఏదో సీరియస్ గా చూస్తున్నారు. నాని మాత్రం బైనాక్యులర్స్ నుంచి చూడకుండా జస్ట్ చేత్తో అలా పట్టుకున్నాడు. పోస్టర్ మాత్రం సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా ఉంది.  నాని గ్యాంగ్ కూడా వెరైటీగా ఉంది. చిన్న పాప నుంచి ఒక బామ్మ దాకా అన్ని ఏజ్ గ్రూప్స్ కు సంబంధించిన వారు ఉన్నారు.  'గ్యాంగ్ లీడర్' అనగానే మనకు ఓ పవర్ ఫుల్ గ్యాంగ్..దానికి  చిరంజీవి లాంటి లీడర్ అనే ఫీల్ వస్తుంది కానీ ఈ గ్యాంగ్ లీడర్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాడు.  మరి ఈ భిన్నమైన గ్యాంగ్ తో నాని ఎలాంటి మిషన్ పై పని చేస్తున్నాడనేది ఒక ఇంట్రెస్టింగ్ అంశమే.

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  'గ్యాంగ్ లీడర్' చిత్రాన్ని ఆగష్టు 30 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  విక్రమ్ కుమార్ తీసిన సినిమాలు ఈమధ్య కమర్షియల్ హిట్స్ ఏమీ కావడం లేదు.  పైగా నాని సినిమాలకు కూడా మంచి పేరు వస్తోంది కానీ బ్లాక్ బస్టర్ కావడంలేదు. మరి ఇద్దరూ కలిసి బాక్సులు బద్దలు కొడతారా లేదా అనేది వేచి చూడాలి.