Begin typing your search above and press return to search.

కంచుకోటలాంటి క్రేజ్ .. టచ్ చేయడం కష్టమే!

By:  Tupaki Desk   |   25 Sep 2021 11:30 PM GMT
కంచుకోటలాంటి క్రేజ్ .. టచ్ చేయడం కష్టమే!
X
కన్నడలో కూడా పామ్ ఇండియా సినిమాల సంఖ్య పెరుగుతూపోతోంది. కొత్తగా వస్తున్న కన్నడ హీరోలు తమ సినిమాలు తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. కన్నడ స్టార్ హీరోగా యశ్ పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. 'కేజీఫ్' సినిమాతో ఆయన క్రేజ్ సరిహద్దులు దాటేసి వెళ్లింది. ఈ ఒక్క సినిమాతో ఆయన కెరియర్ గ్రాఫ్ .. మార్కెట్ ఒక్కసారిగా మారిపోయాయి. ఇక 'కేజీఎఫ్ 2'పై మొదటిభాగానికి మించిన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదల తరువాత యశ్ డేట్లు దొరకడం కష్టమేనని చెప్పుకుంటున్నారు.

పాన్ ఇండియా స్టార్ల మధ్య పందాలు మొదలైన తరువాత, కన్నడలో ఇతర హీరోల క్రేజ్ తగ్గినట్టేనని అంతా అనుకుంటున్నారు. ఇక లోకల్ మార్కెట్ ఉన్న హీరోల సినిమాలను గురించి పట్టించుకోవడం అంతగా ఉండదని అనుకున్నారు. కానీ పాన్ ఇండియా సినిమాలు చేసే స్టార్ల వలన, లోకల్ మార్కెట్ ను శాసించే హీరోలకు ఎలాంటి ఢోకా ఉండదనే విషయం తాజాగా అర్థమవుతోంది. 'జేమ్స్' సినిమా వలన ఈ విషయం నిరూపితమవుతోంది.

కన్నడ నుంచి పాన్ ఇండియా స్టార్ గా యశ్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉన్నప్పటికీ, లోకల్ గా జోరు చూపించే హీరో పునీత్ రాజ్ కుమార్ అనే విషయం మరోసారి స్పష్టమైంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'జేమ్స్' సినిమా ముస్తాబవుతోంది. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, పునీత్ రాజ్ కుమార్ సరసన నాయికగా ప్రియా ఆనంద్ అలరించనుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు 15 కోట్లకు అమ్ముడవడం విశేషం. ఇది పునీత్ రాజ్ కుమార్ క్రేజ్ కి నిదర్శనంగా అభిమానులు చెప్పుకుంటున్నారు.

కన్నడ రాజ్ కుమార్ కి అక్కడ కన్నడ కంఠీరవ అని పేరు. ఆయన నటించిన 'బంగారద మనుష్య' సినిమా మాదిరిగానే ఆయనను అంతా 'బంగారు మనిషి' అని చెప్పుకునేవారు. ఇక ఇండస్ట్రీలో అప్పట్లో ఆయనను అంతా 'అన్నగారు' అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. దాదాపు 50 ఏళ్లపాటు ఆయన కన్నడ పరిశ్రమలో తిరుగులేని రాజుగా కొనసాగారు. అందువలన ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు ఆ క్రేజ్ ఒక కంచు కవచంలాంటిది. కంచుకోటలాంటి ఆ క్రేజ్ ను టచ్ చేయడం కష్టమైన పనే.