బాలయ్య టాక్ షో రెండో సీజన్ లో ఫస్ట్ గెస్ట్ ఎవరంటే..?

Sat Jan 29 2022 14:00:01 GMT+0530 (India Standard Time)

First guest of the second season of Balayya Talk Show

తెలుగు ఓటీటీ 'ఆహా' రూపొందించిన 'అన్ స్టాపబుల్' టాక్ షో ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారిగా హోస్టుగా వ్యవహరించిన ఈ షో అత్యధిక వ్యూవర్ షిప్ తో డిజిటల్ స్పేస్ లో దూసుకుపోయింది.IMBD రేటింగ్స్ లో స్థానం సంపాందించిన ఈ టాక్ షో మొదటి సీజన్ ముగింపు దశకు చేరుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్టుగా హాజరైన ఫైనాలే ఎపిసోడ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి 'అన్ స్టాపబుల్ విత్ NBK' సీజన్-2 మీద పడింది.

బాలయ్య టాక్ షోకు వచ్చిన అనూహ్య స్పందన చూసి ఇప్పుడు నిర్వాహకులు రెండో సీజన్ ని పెద్ద ఎత్తున ప్లాన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తయిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈసారి గెస్టులుగా ఎవరెవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.

'అన్ స్టాపబుల్' మొదటి సీజన్ లో మోహన్ బాబు - మహేష్ బాబు - అల్లు అర్జున్ - నాని - రానా దగ్గుబాటి - విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా సహా పలువురు అగ్ర దర్శకులు నటీనటులు సందడి చేశారు. ఈ క్రమంలో రాబోయే రెండో సీజన్ లో టాలీవుడ్ ప్రముఖులు అతిథిలుగా హాజరు కానున్నారు.

బాలయ్య టాక్ షోకు ఫస్ట్ గెస్టుగా మెగాస్టార్ చిరంజీవి వస్తారని తెలుస్తోంది. 'అన్ స్టాపబుల్' క్రియేటివ్ ప్రొడ్యూసర్ బీవీఎస్ రవి ఇప్పటికే ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. నిజానికి మొదటి సీజన్ లోనే చిరుతో ఓ ఎపిసోడ్ ప్లాన్ చేయగా.. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండటంతో వీలుపడలేదు.

కానీ రాబోయే సీజన్-2 లో బాలకృష్ణతో కలిసి చిరంజీవి సందడి చేయనున్నారు. కరోనా కారణంగా కొన్నాళ్ళు రెగ్యులర్ షూటింగ్స్ జరిగే అవకాశం లేకపోవడంతో.. ఈ సమయాన్ని 'అన్ స్టాపబుల్' కోసం ఉపయోగించుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో త్వరలోనే బాలయ్య - చిరుల ఎపిసోడ్ షూట్ చేయాలని 'ఆహా' టీమ్ ప్లాన్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది.

ఒకే వేదిక మీద చిరంజీవి - బాలకృష్ణ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోవడం అంటే మెగా - నందమూరి అభిమానులను విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద పోటీ పడే వీరిద్దరి మధ్య అనుబంధం ఎలాంటిదనేది ఈ షో ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఇకపోతే 'అన్ స్టాపబుల్ 2' షోలో విక్టరీ వెంకటేష్ తో పాటుగా కింగ్ అక్కినేని నాగార్జునను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అలానే బాబాయ్ బాలయ్య టాక్ షోకి అబ్బాయ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే బాబాయ్ - అబ్బాయ్ ముచ్చట్లు ఎలా ఉంటాయో చూడాలి.